Monday, January 27, 2025

చేవెళ్ల బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థిగా రంజిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ నాయకులకు హితవు పలికారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాల్లో భాగంగా పార్టీ భవన్‌లో చేవెళ్ల పార్లమెంంట్ నియోజకవర్గంపై ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, మాజీ మంత్రులు సబితారెడ్డి, మహేందర్ రెడ్డి శాసనసభ్యులు కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాజీ శాసనసభ్యులు అనంద్, మహేశ్ రెడ్డితో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవడం ఖాయమని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ అభ్యర్థ్దిగా మరోసారి గడ్డం రంజిత్ రెడ్డి బరిలో ఉండాలని కోరారు. పార్లమెంట్ పరిధిలో పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడానికి అందరం కలిసి ప్రయత్నం చేయాలన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో గత పార్లమెంట్ ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతం కన్నా ప్రస్తుతం అధికంగా ఓట్లు వచ్చాయని అన్నారు.

పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వచ్చిన మనం ఘన విజయం సాధిస్తామని అన్నారు. ఇందుకు కార్యకర్తలు, నాయకుల్లో విశ్వాసం కలిగించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని, ఎక్కడా నిర్లక్షం వహించకుండా ముందుకు సాగాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీలు, నియోజకవర్గాల వారిగా సమావేశాలను నిర్వహించాలన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా త్వరలో సమీక్షించుకుందామని అన్నారు. నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలను పూర్తి చేసిన అనంతరం జనవరి 3 పార్లమెంట్ పరిధిలోని 500 మంది ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో బిఆర్‌ఎస్ భవన్‌లో సమావేశం నిర్వహించుకుందామని అన్నారు. శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జీలు పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని, కార్యకర్తలలో నమ్మకం కలిగించాలని అన్నారు.

పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా, వాటిని తొలగించేలా సమావేశాలు నిర్వహించి సమన్వయం చేసుకోవాలని సూచించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రంజిత్‌రెడ్డి వ్యక్తిగతంగా, ట్రస్టు ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపునకు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. చేవెళ్ల గడ్డపై మరోసారి జెండాను ఎగరవేసే బాధ్యత అందరిపై ఉందని సూచించారు. మాజీ మంత్రులు సబితారెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు జిల్లా నేతలు సైతం రంజిత్ రెడ్డి విజయం కోసం పూర్తి స్థాయిలో కృషిచేస్తామని అన్నారు.

బరిలో రంజిత్ రెడ్డి…
చేవెళ్ల పార్లమెంట్ బిఆర్‌ఎస్ అభ్యర్దిగా రంజిత్ రెడ్డి బరిలో ఉండటం ఖాయమైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో ఇప్పటివరకు ఏ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకముందే బిఆర్‌ఎస్ చెవెళ్ల అభ్యర్థ్దిత్వం రంజిత్ రెడ్డికి ఖరారు అయింది. దీంతో క్షేత్రస్థాయిలో మరింత దూకుడుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News