మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ చందనవెల్లి సమీపంలోని బాలాజీ దేవాలయం మెట్ల బావిని దత్తత తీసుకుని పునరుద్ధరించాలని మంత్రి కెటిఆర్ వినతిపై చేవెళ్ల టిఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి స్పదించారు. కెటిఆర్ అభ్యర్థనని వెంటనే ఆచరిస్తానని రంజిత్‌రెడ్డి చెప్పారు. 700 ఏళ్ల నాటి మెట్ల బావి గొప్ప పర్యాటక ప్రదేశమని, నిర్వహణ సరిగ్గా లేదని, దయచేసి ఈ దేవాలయాన్ని కాపాడాలని ఆర్‌పి ముసునూరి అనే నెటిజన్ ఆదివారం కెటిఆర్‌కి ట్వీట్ చేశారు. నెటిజన్ ట్వీట్ కి కెటిఆర్ స్పందిస్తూ.. ‘మేము ఖచ్చితంగా దేవాలయాన్ని పునరుద్దిస్తాం సార్. అందంగా తీర్చి దిద్దుతాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎంపి డాక్టర్ రంజిత్‌రెడ్డి బాలాజీ మెట్ల దేవాలయాన్ని పునరుద్ధరించాలని అభ్యర్థిస్తున్న. పుట్టినరోజు శుభాకాంక్షలు రంజిత్ అన్న’ అని కెటిఆర్ ట్వీట్ చేశాడు. ఇక మంత్రి కెటిఆర్ వినతిపై స్పందించిన రంజిత్‌రెడ్డి.. ‘మెట్లబావిని పునరుద్ధరించేందుకు చొరవ చూపుతానని, ఈ అద్భుతమైన అవకాశాన్ని తన పుట్టినరోజు నాడు ఇచ్చినందుకు కెటిఆర్‌కి ధన్యవాదాలు. తెలంగాణ అందమైన వారసత్వాన్ని పునరుద్దిస్తాన’ని రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు.
MP Ranjith Reddy Adopt Balaji Temple for KTR Request