ఇడి చర్యపై శివసేన ఎంపి రౌత్ ఆరోపణ
ముంబై: తన ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన చర్యను మధ్యతరగతి మరాఠీ జీవిపై జరిగిన దాడిగా శివసేన ఎంపి సంజయ్ రౌత్ అభివర్ణించారు. అటువంటి చర్యలకు తాను భయపడేది లేదని, తనపై ఎటువంటి ఒత్తిడి వచ్చినా ప్రతిఘటిస్తానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ముంబయి పోలీసులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఇడి అధికారులు తన ఆస్తులను జప్తు చేశారని సంజయ్ గుర్తు చేశారు. కొంతమంది ఇడి అధికారులు ఈ విధంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గత నెల తాను చేసిన ఆరోపణలకు ప్రతీకారంగా వారు ఈ పని చేశారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించబోవని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాను సహకరించనందుకే బిజెపి ఈ తనపై కక్షకట్టిందని ఆయన ఆరోపించారు.