మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం, పచ్చదనాన్ని పెం పొందించడం తప్పనిసరి. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చదనాన్ని పెంచడం తక్షణావసరం. ఈ అవసరాన్ని గుర్తు చేసి, ప్రజలందరినీ పచ్చదనాన్ని పెంచే మహాయజ్ఞం వైపు అడుగులు వేయించాలి. ఈ బాధ్యతనే తీసుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే మహా యజ్ఞాన్ని ప్రారంభించి ప్రజలను పర్యావరణాన్ని కాపాడుకునే క్రతువులో భాగస్వాములను చేస్తున్నారు.
కోటి అడుగులైనా ఒక్క అడుగుతోనే ప్రారంభించాలి. ఆ అడుగే సంతోష్ కుమార్ వేశారు. చరిత్ర చూసుకుంటే… ఏ గొప్ప ఘట్టమైనా ఒక్కరి ఆలోచన, ఆచరణతోనే ప్రారంభమైంది. ఆ ఒక్కరే అందరినీ కదలించి లక్ష్యసాధన వైపు అడుగులు వేయించారు. మన దేశంలో ప్రకృతిని కాపాడుకోవాలనే లక్ష్య సాధనకు అందరినీ కదిలించే గొప్ప ఘట్టానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఒంటరిగా ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు లక్షలాది మంది భాగస్వాములవుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద భేదం లేదు.. సామాన్య పౌరుడి నుంచి అత్యున్నత పదవుల్లో ఉన్న వారి వరకు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగమవుతున్నారు. ప్రకృతిని కాపాడుకునే ఈ మహత్తర కార్యక్రమంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించడానికి స్ఫూర్తినిచ్చింది మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సిద్దిపేటలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తన ఏ బాధ్యతలో ఉన్నా పచ్చదనాన్ని పెంపొందించడంపై కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెడతారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మన రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చుకోవాలనే బృహత్తర ఆలోచనతో ఆయన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. గత ఏడేళ్లుగా ప్రతీ సంవత్సరం రాష్ట్రం లో కోట్లాది మొక్కలు నాటే ఈ కార్యక్రమం మన రాష్ట్రాన్ని పచ్చటి ప్రకృతికి నెలవుగా చేస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ఈ స్ఫూర్తితోని అందిపుచ్చుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు.
ప్రజలందరినీ భాగం చేయాలని, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనే సంకల్పంతో ఆయన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు రూపకల్పన చేశారు. ఒక్కడిగా ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు లక్షల మంది పాల్గొంటున్నారు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించడం అంత కష్టమేమీ కాదు. కానీ, అందరినీ కదిలించి, ఆ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం మాత్రం చాలా కష్టమైన పని. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఈ కష్టమైన పనిని బాధ్యతగా తీసుకున్నారు సంతోష్ కుమార్. ప్రజల్లోకి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని తీసుకెళ్లడంలో, పచ్చదనాన్ని కాపాడుకునే బాధ్యతను అందరిపైనా ఉందని గుర్తు చేసి ఇందులో పాల్గొనేలా చేయడంలో ఆయన విజయవంతమయ్యారు. మనం ఒక్క మొక్క నాటి మరో ముగ్గురితో నాటించడం, ఆ ముగ్గురూ తలో ముగ్గురితో నాటించడం, వారు కూడా తలో ముగ్గురితో నాటించడం అనే ప్రణాళికతో ఈ కార్యక్రమానికి సంతోష్ కుమార్ రూపకల్పన చేశారు. అందరినీ భాగస్వాములను చేయాలనే ఆలోచనతోనే ఆయన ఈ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు.
ప్రపంచంలో రకరకాల చాలెంజ్‌ల పేర్లు వినిపిస్తుంటాయి.. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో మొదలయ్యే ఇలాంటి చాలెంజ్‌లను మన దేశ యువత తీసుకొని చేసేవారు. వీటిలో చాలా వాటికి ఒక బాధ్యత, లక్ష్యం అంటూ ఉండవు. కేవలం వినోదం కోసమే ఇవి జరిగాయి. అందుకే, కొన్ని రోజులకే వీటిని అందరూ మరిచిపోయారు. కానీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ అంటే ఒక బాధ్యత. అందరం కలిసి సాధించాల్సిన లక్ష్యం. అందుకే, ఈ చాలెంజ్ రోజులు గడుస్తున్నా కొద్దీ మరింత పాపులర్ అవుతోంది. ఎంతో మంది కొత్తగా ఇందులో భాగమవుతున్నారు. ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమయ్యే కార్యక్రమాలకు మన యువత ఆకర్షితులవుతారు. కానీ, మన దేశంలో మొదలైన గ్రీన్ ఇండి యా చాలెంజ్ మన దేశ ప్రజలనే కాకుండా, విదేశాల్లో ఉన్న మన భారతీయులను కూడా ఆకర్షించింది. అందుకే, విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు కూడా ఆయా దేశాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగస్వాములవుతున్నారు.
ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలంటే సమాజంలో ప్రభావం చూపించే వివిధ రంగాల్లోని ప్రముఖులు అందులో పాలు పంచుకోవాలి. ఈ విషయాన్ని గుర్తించిన సంతోష్ కుమార్ అన్ని రంగాల్లోని ప్రముఖులను గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగం చేశారు. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లోని ప్రముఖులంతా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. తద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సంతోష్ కుమార్ విజయవంతమయ్యారు. మొక్కలు నాటడం ద్వారా ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇప్పుడు అడవులను దత్తత తీసుకునే వరకు విస్తరించింది.
అనేక మంది సెలబ్రిటీలు మొక్కలు నాటి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. జోగినపల్లి సంతోష్ కుమార్ విజ్ఞప్తి మేరకు ప్రభాస్, నాగార్జున లాంటి సినీ ప్రముఖులు అడవులను దత్తత తీసుకొని అడవులను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నారు. అన్ని రంగాల ప్రముఖులు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని వారి రంగాల్లోని మిగతా ప్రముఖులకు చాలెంజ్ చేస్తూ వారిని కూడా ఇందులో భాగం చేస్తున్నారు. సినీ రంగంలో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, నాగచైతన్య, బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కోలీవుడ్ హీరో తళపతి విజయ్ వంటి వారంతా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగమయ్యారు. క్రీడారంగం నుంచి సచిన్ టెండూల్కర్, పివి సింధు, సైనా నేహ్వాల్, పుల్లెల గోపీచంద్ వంటి వారితో పాటు ఇంకా అనేక మంది గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ఇప్పటి వరకు భాగస్వాములయ్యారు. పార్టీలకు అతీతంగా దేశంలోని వివిధ పార్టీల నేతలు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మొదలుకొని వివిధ రాష్ట్రాల ఎంపిలు, ఎమ్మెల్యేలు, నేతలంతా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు మద్దతు పలికారు. మన రాష్ట్రంలో నేతలు వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటడం ఒక సంప్రదాయంగా మారింది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ విదేశాలకు కూడా విస్తరించింది. ఆస్ట్రేలియా ఎంపి జసన్‌వూడ్, న్యూజిలాండ్ ఎంపి ప్రియాంక రాధాకృష్ణన్ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతో పాటు అడవులను పరిరక్షించుకునేందుకుగాను అడవులను దత్తత తీసుకునే కార్యక్రమానికి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఆయనే స్వయంగా మేడ్చల్ జిల్లా కీసరలోని 2,400 ఎకరాల అడవిని దత్తత తీసుకొని అటవీ పరిరక్షణ బాధ్యత చేపట్టారు. అడవిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తూ దట్టమైన అడవిగా మారుస్తున్నారు. సంతోష్ కుమార్ స్ఫూర్తితో హీరో ప్రభాస్ 1650 ఎకరాల కాజీపల్లి అడవిని దత్తత తీసుకున్నారు. హీరో నాగార్జున చెంగిచర్లలోని 1080 ఎకరాల అడవిని దత్తత తీసుకున్నారు. ఈ స్ఫూర్తితో మరింత మంది అడవులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు పర్యావరణవేత్తల ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది పుడమితల్లిని చల్లగా మార్చే అద్భుత కార్యక్రమమని ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సొల్హెమ్ ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎప్పటికీ కొనసాగాలి. ప్రకృతిని కాపాడే ఈ క్రతవులో అందరమూ భాగం కావాలి.
డా. ఎన్. యాదగిరి రావు
(అడిషనల్ కమిషనర్ జిహెచ్‌ఎంసి)