రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మనం బ్రతుకుదాం..- పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దామని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం ఆందోళన కలిగిస్తుందన్నారు.ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విపత్కర పరిస్థితుల నుంచి మన భవిష్యత్ తరాలు బ్రతికి బట్టకట్టాలంటే మనమంతా మేలుకోని, విరివిగా మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మనకు చిన్న గాయమైతేనే విలవిల్లాడిపోతామని అట్లాంటిది భూమికి మనుషుల విపరీత పోకడలతో తగిలిన గాయాలు భవిష్యత్తు తరాలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. జీవం బ్రతికేందుకు ఒక్కటే భూమి ఉందన్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకొని జాగ్రత్తపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి ధరిత్ర దినోత్సవం- 2022 నినాదం ఇన్వెస్ట్ ఇన్ ఆవర్ ప్లానెట్ నినాదం మేరకు మనమంతా భూమిని కాలుష్యరహితం చేసేందుకు మట్టిని రక్షిద్దాం నినాదంతో ముందుకుసాగాలని ఆయన కోరారు.