హైదరాబాద్: బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన రన్ ఫర్ పీస్ ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కె, 5కె, 3కె రన్ ఫర్ పీస్ ను ఎంపి సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ నిర్వహించడం చాలా శుభ పరిణామం అని దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని కానీ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు.
ఈ గార్డెన్ అభివృద్ధి కోసం అసోసియేషన్ వారు చాలా కృషి చేస్తున్నారని వారికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ గార్డెన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం తన రాజ్యసభ నిధులనుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని తెలియజేశారు. సంతోష్ ప్రకటనను స్ఫూర్తిగా తీసుకొని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కూడా వారి అభివృద్ధి నిధుల నుండి తలా 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అందరు కలిసి పార్కు అభివృద్ధి కోసం 40 లక్షల నిధులు ఇచ్చిన వారందరికీ వాకర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటే ప్రతాపరెడ్డి, స్పోర్ట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పిసిసిఎఫ్ డోబ్రియాలు, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ రెడ్డి, బాలకృష్ణ ఏవీ రెడ్డి, పెద్ద ఎత్తున వాకర్సు పాల్గొన్నారు.