కేంద్రానికి జెఎసి అభ్యర్థన
ప్రధాని మోడీకి ఎంపిలు వినతిపత్రం అందజేయాలని నిర్ణయం
చెన్నై : 1971 జనాభా లెక్కల ప్రాతిపదికపై పార్లమెంటరీ నియోజకవర్గాలపై స్తంభనను మరి 25 సంవత్సరాల పాటు కొనసాగించాలని కేంద్రానికి డిఎంకె నాయకత్వంలోని సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశం శనివారం విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ సభ్యులు తమ కోర్కెలపై ఒక ఉమ్మడి వినతిపత్రాన్ని ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించాలని జెఎసి సమావేశంలో నిర్ణయించింది. జెఎసి సమావేశంలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు.
‘న్యాయమైన రీతిలో డిలిమిటేషన్’ జరిగేలా చూడాలని కోరుతూ డిఎంకె నేతృత్వంలో జెఎసిని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రజాస్వామ్య వ్యవస్థ ‘ఉద్దేశం, లక్షణం’ మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ చేపట్టే ఏ డిలిమిటేషన్ ప్రక్రియనైనా పారదర్శకంగా, అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు చర్చించి , దోహదం చేసే రీతిలో నిర్వహించాలని తీర్మానం కోరింది. ‘42వ, 84వ, 87వ రాజ్యాంగ సవరణల వెనుక శాసనవ్యవస్థ ప్రధానోద్దేశం జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు జరిపిన రాష్ట్రాలను పరిరక్షించడం/ ప్రోత్సహించడం అయినందున, జాతీయ జనాభా క్రమబద్ధీకరణ లక్షాన్ని ఇంకా సాధించనందున 1971 జనాభా లెక్కల ప్రాతిపదికపై పార్లమెంటరీ నియోజకవర్గాల స్తంభనను మరి 25 సంవత్సరాలు పొడిగించాలి’ అని జెఎసి తన తీర్మానంలో సూచించింది.
జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు జరిపిన, తద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలను శిక్షించరాదని, ఇందు నిమిత్తం కేంద్రం అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలని జెఎసి కోరింది. ప్రాతినిధ్య రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులతో కూడిన కోర్ కమిటీ పైన పేర్కొన్న సూత్రాలకు భిన్నంగా ఏ డిలిమిటేషన్ ప్రక్రియనైనా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేసే ఏ ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు పార్లమెంటరీ వ్యూహాలను సమన్వయం చేస్తుంది. ఎంపిల కోర్ కమిటీ పైన ప్రస్తావించిన విధంగా ఉమ్మడి వినతిపత్రాన్ని ప్రస్తుత పార్లమెంటరీ సెషన్‌లో ప్రధానికి అందజేస్తుంది’ అని తీర్మానం తెలియజేసింది. సమావేశంలో ప్రాతినిధ్యం ఉన్న వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఈ అంశంపై తమ తమ రాష్ట్రాలలో సముచిత శాసనసభ తీర్మానాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించి, కేంద్ర ప్రభుత్వానికి ఆ విషయం నివేదిస్తాయని తీర్మానం తెలిపింది.
‘గత డిలిమిటేషన్ ప్రక్రియల చరిత్ర, నేపథ్యం, తమ తమ రాష్ట్రాల పౌరులపై ప్రతిపాదిత డిలిమిటేషన్ పరిణామాల గురించిన సమాచారాన్ని సమన్వయీకృత ప్రజాభిప్రాయ సేకరణ వ్యూహం ద్వారా అందజేసేందుకు అవసరమైన యత్నాలను జెఎసి చేస్తుంది’ అని తీర్మానం తెలియజేసింది. ఇది ఇలా ఉండగా, డిఎంకె సామాజిక మాధ్యమంలో అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా డిలిమిటేషన్ గురించిన సమాచారం పంపిణీకి తన యత్నాలు ప్రారంభించింది.