చట్టసభలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే అవకాశం
రాజ్యసభలో ప్రశ్నించిన టిఆర్‌ఎస్ ఎంపి సురేశ్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా …కేంద్రం ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరకపోవడం విచారకరమని టిఆర్‌ఎస్ ఎంపి సురేశ్‌రెడ్డి అన్నారు. దేశంలో అత్యున్నతమైన పార్లమెంట్‌లో చేసిన చట్టాలు…ఇచ్చిన హామీలు నెరవేరకపోతే….చట్టసభలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రముదముందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, విభజన సమస్యలు తేలకపోవడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి తగు రీతిలో స్పందన రావడం లేదని అన్నారు.
ఈ విషయంలో కేంద్రం ఎందుకు తగు శ్రద్ద చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. చట్టసభల్లో కేంద్రం ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని తాము కోరుతున్నామని సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేతప్ప తామేమి గొంతెమ్మ కోరికలు అడగడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు.విభజన చట్టంలో ఇంకా నెరవేరాల్సినవి 38 అంశాలున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవాలని సురేశ్‌రెడ్డి కోరారు.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఐటి సహా ఎన్నో హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ అంశాలను పరిష్కరించడానికి కేంద్రం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. చట్టంలోని అంశాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాజ్యాంగపరంగా కేంద్రంపై ఉందన్నారు. న్యాయం చేయడం ఆలస్యమైతే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్లేగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా పార్లమెంటుపై ప్రజలు విశ్వాసం కోల్పోతారన్నారు. అందువల్ల నిర్దిష్ట సమయంలో హామీలు నెరవేర్చేలా దిశానిర్దేశం చేయాలని కోరుతున్నామని సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాగునీరు…సాగునీరు, విద్యుత్ పంపకాలలో రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పేచీలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విబేధాలు మరింత ముదరకముందే కేంద్రం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను నెరవేర్చే అంశంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.