Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌కు ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయిందని నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్‌చేయాలని సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. 2018 నూతన పంచాయితీరాజ్ చట్టం మేరకు గ్రామాల అభివృద్ధి కోసం మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్‌తో 2019 ఏప్రిల్ 12న 9,355 మంది పంచాయితీ కార్యదర్శులుగా నియమించారని, కానీ నాలుగేళ్లు గడిచినా రెగ్యులర్ చేయకపోవడం సరికాదన్నారు. జేపీఎస్‌లవి న్యాయపర మైన డిమాండ్లేనని, తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులు, 42కు పైగా రికార్డుల బాధ్యతలు నిర్వర్తిస్తూ 12 గంటల పాటు పనిభారంతో సతమతమవుతున్నారన్నారు.

ఇప్పటికే చాలామంది తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఒత్తిడికి తట్టుకోలేక సుమారు 1500 ఉద్యోగాలు వదిలేశారని తెలిపారు. అనారోగ్య సమస్యలతో 44 మంది మృతి చెందారన్నారు. ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత ఉన్నదని నొక్కి చెప్పారు. చనిపోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఔట్‌సోర్సింగ్ సెక్రటరీలను కూడా రెగ్యులర్‌చేయాలన్నారు. దీంతో పాటు మహిళా పంచాయితీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులతో పాటు 90 రోజుల చైల్ కేర్ సెలవులు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News