Sunday, January 19, 2025

ఎం.ఫిల్ కోర్సు రద్దులో ఔచిత్యం ఉందా?

- Advertisement -
- Advertisement -

ఈ అకడమిక్ ఇయ్యర్‌లో మన దేశ విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ కోర్సుల్లో చేరాలని ఉత్సాహపడుతున్న విద్యార్ధుల అభిలాషను నిరుత్సాహ పరుస్తూ గత నవంబర్ 2022న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఆ కోర్సును రద్దు చేసినట్లు చేసిన ప్రకటన వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఎంఫిల్ కోర్సును ఎందుకు రద్దు చేశారో కారణాలను మాత్రం యుజిసి ప్రకటించ లేదు. ఒక కోర్సును కొనసాగించాలా, తిరస్కరించాలా లేదా దాని స్థానంలో మరో నూతన కోర్సును ప్రవేశపెట్టాలా అనే విషయంలో అంతిమ నిర్ణయం తీసుకొనే అధికారం యుజిసికి వుంది. దానిని ఎవరూ ప్రశ్నించడం లేదు. అయితే ఒక కోర్సును ప్రారంభించడానికీ లేదా అర్ధాంతరంగా రద్దు చేయడానికి సహేతుక కారణాలను వెల్లడించడం విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎంఫిల్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పరిశోధన కోసం చేసే షార్ట్ టర్మ్ కోర్సు. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు, డాక్టోరల్ (పిహెచ్‌డి) కోర్సుల మధ్య వున్నటువంటి మిడ్‌వే కోర్సు. పిహెచ్‌డి అనేది దీర్ఘకాలిక పరిశోధన కోర్సు. ఇది సైన్స్ సబ్జెక్టులలో దాదాపు నాలుగు సంవత్సరాల వరకు కాలపరిమితి వుంటుంది.

(అవసరమైతే రీసెర్చ్ సూపర్ వైజర్) అనుమతితో కాలపరిమితిని యూనివర్శిటీ పొడిగిస్తుంది. అలాగే పీల్ డేటా కలెక్షన్‌పై ఆధారపడిన ఆర్ట్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ సబ్జెక్టులకు 4-5సంవత్సరాలకు మించి కాలపరిమితి వుంటుంది. పిహెచ్‌డి వంటి దీర్ఘకాలిక కోర్సును కొనసాగించలేని వారు కేవలం మూడు సెమిస్టర్‌ల వరకు మాత్రమే వుండే ఎంఫిల్‌ని రీసెర్చ్ స్కాలర్లు ఎంచుకోవచ్చు. గతంలో యం.లిట్ (MLitt) కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అనేక విశ్వవిద్యాలయాలలో ఉనికిలో ఉండేవి. కానీ 1970లలో, ఈ కోర్సుకు బదులు కొత్తగా ఎంఫిల్‌తో దానిని భర్తీ చేశారు. ఆ విధంగా పరిశోధన ద్వారా పేరు మాత్రమే ఎంఫిల్ డిగ్రీకి మార్చబడింది. తత్వశాస్త్రం, సాహిత్యంతో సహా అనేక రంగాలకు కలిగి వున్నందున ఇది మాస్టర్ ఆఫ్ లిటరేచర్ (MLitt) కాదు, Phd (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ)లో వలే మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎంఫిల్) అని పేరు మార్చారు. దీనికి ప్రధాన కారణం విద్యార్థులు సాధారణంగా ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు బోధించే కళాశాలల్లో లెక్చరర్ వృత్తిని చేపట్టాలనుకుంటే ఎంఫిల్ వంటి షార్ట్ డ్యూరేషన్ కోర్సును ఎంచుకుంటారు. యూనివర్శిటీలు, ఐఐటిలు, ఐఐఎంలు, ఇతర జాతీయ పరిశోధనా సంస్థల్లో టీచింగ్/ పరిశోధనా పొజిషన్‌లను స్వీకరించడానికి పి.హెచ్‌డి అవసరం.

అయితే, ఇటీవల కాలంలో యుజిసి ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలల్లో ఫ్యాకల్టీగా పని చేయడానికి ప్రవేశస్థాయిలో పిహెచ్‌డి అర్హత తప్పనిసరి కాదు అని యుజిసి తెలిపింది. నిజానికి టీచింగ్, రీసెర్చ్ అనేవి ఒకే నాణేనికి వుండే రెండు పార్శ్వాలు వంటివి. టీచింగ్ ప్రొఫెషన్‌లో పని చేసే ప్రతి ఒక్కరికీ చక్కటి బోధనా నైపుణ్యాలతో పాటు పరిశోధనా దృక్పథం వుండడం అవసరం. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. పోషకాలు కూడా. వీటిని విడివిడిగా చూడలేము. ఇంటర్మీడియట్ స్థాయిలో బోధించే లెక్చరర్లకు మాస్టర్ ఆప్ ఎడ్యుకేషన్ (ఎంఇడి) చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంటర్ విద్యార్ధులు 15- 16 సంవత్సరాల టీనేజ్‌లోకి ప్రవేశిస్తారు. ఆ వయసులోని వారి మానసిక స్థితి భిన్నంగా వుంటుం ది. జీవితాన్ని మలుపు తిప్పే పరిస్థితి వుంటుంది. కనుక వారికి బోధించడానికి జూనియర్ కాలేజీల్లో పని చేసే జూనియర్ లెక్చరర్లకు ఎడ్యుకేషన్ సైకాలజీలో శిక్షణ పొందడం అవసరం. కానీ ఇంటర్మీడియేట్ బోర్డు ఆ నిబంధన విధించలేదు. ఇక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో వంద శాతం బోధనే వుంటుంది. పరిశోధనా అవకాశాలు, వనరులు, వసతులు వుండవు.

కనుక వారికి పిజితో పాటు పరిశోధనా దృక్పథం కోసం ఎం.ఫిల్ డిగ్రీ వుంటే సరిపోతుంది. ఇవి మైనర్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి అధ్యాపకులకు ఉపయోగపడతాయి. యూనివర్శిటీ సర్వీసులోకి వెళ్ళదలచిన వారికి పి.హెచ్.డి తప్పనిసరిగా అవసరం అవుతుంది. అక్కడ పిజి విద్యార్ధులకు బోధనతో పాటు పరిశోధనా నైపుణ్యాలు అలవాటు కావాలి. అంతేకాకుండా యూనివర్శిటీలు పిహెచ్.డి కోర్సులతో పాటు అనేక విషయాల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్‌లను కూడా అనుబంధంగా చేపడతాయి. యూనివర్శిటీలు ప్రధానంగా పరిశోధనా కేంద్రాలుగా ఉంటాయి. ఎంఫిల్ ఆవశ్యకత పిహెచ్‌డి వంటి పరిశోధనా కోర్సులకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కాలేజియేట్ స్థాయిలో టీచింగ్ పొజిషన్లను చేపట్టాలనే ఆసక్తి ఉన్నవారు ఎం.ఫిల్ వంటి సంక్షిప్త కోర్సుతో బాగా రాణించగలుగుతారు. గతంలో విద్యా నిపుణులు తమ విజ్ఞతతో ఎంఫిల్ కోర్సును రూపొందించారు. విదేశాల విశ్వవిద్యాలయాలు సైతం ఎం.ఫిల్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఎం.ఫిల్ కోర్సులో పరిశోధన మూలాధార సూత్రాలు (రీసెర్చ్ మెథడాలజీ) పరిశోధకుడికి అందించబడతాయి.పరిశోధన సాధారణ సూత్రాలు ప్రతి బ్రాంచ్‌కు సాధారణం.

ఇది ఎం.ఫిల్ కోర్సు కళాశాల స్థాయిలో కాబోయే ఉపాధ్యాయుడు సమర్థవంతమైన ఉపన్యాసకుడిగా రాణించడానికి తగినంత సమాచారం, ఉత్సాహం, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఎం.ఫిల్ కోర్సు ప్లస్ 2, అండర్ గ్రాడ్యుయేట్ తరగతులలో ఉపాధ్యాయులకు ఒక వరం. ఎం.ఫిల్‌ను రద్దు చేయడం వల్ల దాని ప్రయోజనం కోసం పని చేస్తున్న స్వల్పకాలిక పరిశోధన కోర్సును తిరస్కరించడమే కాకుండా కళాశాలల్లోని విద్యార్థులను చాలా ప్రతికూల స్థితిలోకి నెట్టినట్లు అవుతుంది. ఎం.ఫిల్ తొలగించి దాని స్థానంలో మరో కొత్త కోర్సును ప్రవేశపెట్టలేదు. ఇలా చేయడం ఆరోగ్యకరమైన విద్యా వ్యవస్థకు మంచిది కాదు. ఈ కోర్సును రద్దు చేస్తే పిజి కి, పిహెచ్.డి కి మధ్య శూన్యత (వాక్యూమ్)ను సృష్టించడమే అవుతుంది. అయితే రీసెర్చ్ డిగ్రీలను కలిగి ఉన్న ఉపాధ్యాయులను తిరస్కరించినందున అలాంటి కళాశాలల్లోని విద్యార్థులే ఎక్కువ నష్టపోతున్నారు. పిహెచ్‌డి వున్న పరిశోధకులు సాధారణంగా యూనివర్శిటీలు, ఐఐటిలను ఎంపిక చేసుకుంటారు. కళాశాలల్లో ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు.

అందువల్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎటువంటి పరిశోధనా నేపథ్యం వున్న ఉపాధ్యాయులచే బోధించబడే అవకాశాన్ని పొందలేరు.ఎం.ఫిల్‌ను రద్దు చేయడం పరిశోధనా కోర్సును తిరస్కరించడమే కాకుండా, డిగ్రీ స్థాయిలో వున్న విద్యార్థులను బలహీనపరుస్తుంది. ఎందుకంటే వారు ఇప్పుడు మెరుగైన- అర్హత కలిగిన లెక్చరర్ల ప్రయోజనాలను పొందలేరు. అందువల్ల యూనివర్శిటీల్లో ప్రస్తుతం వున్న ఎం.ఫిల్ కోర్సును రద్దు చేయాలనే యుజిసి నిర్ణయంపై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుత ఎం.ఫిల్ కోర్సులో వున్న ప్రయోజనాలు, విద్యార్థులు ఎదుర్కొనే ప్రతికూలతల దృష్ట్యా యుజిసి పునరాలోచించి, ప్రస్తుత ఎం.ఫిల్ కోర్సు ను మరో మధ్యవర్తిత్వ పరిశోధనా కోర్సుతో భర్తీ చేసేంత వరకు కొనసాగించాల్సిన అవసరం వుంది.ఈ రీసెర్చ్ డిగ్రీలను కలిగి వున్న ఉపాధ్యాయులను తిరస్కరించడం వల్ల విద్యార్థులు నష్టపోతారు. దేశంలో ప్రస్తుతం పని చేస్తున్న అధ్యాపకులు, రిటైర్ అయిన విద్యావేత్తలు యుజిసికి తగిన సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News