Monday, December 16, 2024

పిసిసి నూతన కార్యవర్గంలో ఎంపిలు, ఎమ్మెల్యేలు?

- Advertisement -
- Advertisement -

మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కని అసంతృప్తులకు కార్యవర్గంలో చోటు
పదవుల ఎంపికలో పార్టీ, ప్రభుత్వం పెద్దల నుంచి పిసిసి అధ్యక్షుడికి ఒత్తిడి
పనితీరు ఆధారంగా పదవులకు ఎంపిక
తుది నిర్ణయం ఏఐసిసికి అప్పగింత

మనతెలంగాణ/హైదరాబాద్: పిసిసి నూతన కార్యవర్గంలో ఎంపిలు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించనున్నట్టుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కని అసంతృప్తులకు ఈ కార్యవర్గంలో చోటుదక్కవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ విషయమై చర్చ జరుగుతున్నట్టుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే వారి పేర్లు ఫైనల్ అయితే మిగతా వారి పేర్లను పిసిసి కార్యవర్గంలోకి తీసుకోవాలని టిపిసిసి భావిస్తున్నట్టుగా తెలిసింది. పదవుల ఎంపికలో పార్టీ, ప్రభుత్వం పెద్దల నుంచి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి ఒత్తిడి ఎక్కువ అయినట్టుగా తెలిసింది. తమ అనుచరులకు పదవులు ఇప్పించే విషయంలో పిసిసిపై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రస్థాయి పోస్టు నుంచి జిల్లా పోస్టుల వరకు ఇదే పరిస్థితి నెలకొందని, అయితే ఈ సారి పనిచేసే నేతలకే పదవులు ఇవ్వాలని ఏఐసిసి ఆదేశించడంతో ఆ దిశగా టిపిసిసి తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది.

అన్ని జిల్లాలు, కులాలకు

ఇప్పటికే అధిష్టానంతో సిఎం, డిప్యూటీ సిఎం మంత్రివర్గ విస్తరణపై పలు దఫాలుగా చర్చించిన నేపథ్యంలో త్వరలోనే మరోసారి పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టిలతో భేటీ అయ్యి పిసిసి పునర్ వ్యవస్థీకరణను జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లతో పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూర్పు చేసినట్టుగా తెలిసింది. అయితే, మంత్రివర్గ విస్తరణ తరువాత పూర్తిస్థాయి మార్పులు, చేర్పులు చేసి కార్యవర్గాన్ని ప్రకటించాలని పిసిసి అధ్యక్షుడు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే పిసిసి నూతన కార్యవర్గానికి సంబంధించి అధ్యక్షుడు తన మార్కు ఉండేలా, తన అనుచరులు ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు అన్ని జిల్లాలు, అన్ని కులాలకు కూడా అవకాశం కల్పించాలని, బిసిలకు మాత్రం కొంతమేర ప్రాధాన్యత పెంచాలని ఆయన ఆలోచనగా సమాచారం.

ఎంపిలు, ఎమ్మెల్యేలకు అవకాశాలు

ప్రజల్లో పార్టీ తరపున తమ గళాన్ని తీసుకెళ్లే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టిపిసిసి నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంపిలకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, ఎమ్మెల్యేలకు పార్టీలో స్పోక్స్ పర్సన్లుగా అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.ఇప్పటికే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారు పార్టీలో తగ్గిపోయారు. దీంతోపాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు వెనుకంజలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే అధిష్టానానికి సైతం ఓ నివేదిక అందినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే చురుగ్గా ఉండే ప్రజా ప్రతినిధులకు నిరంతరం ప్రజలతో మమేకయ్యే వారికి పార్టీలో ముఖ్యమైన పదవులను కేటాయించాలని అధిష్టానం ఇప్పటికే టిపిసిసి సూచించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సంవత్సరకాలంగా పార్టీలో చురుగ్గా ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లు సైతం అధిష్టానం సేకరించిందని ముందుగా వారికి టిపిసిసిలో అధిక ప్రాధాన్యత ఉన్న పోస్టులు దక్కవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గాంధీభవన్ నుంచి జిల్లా స్థాయిలో కమిటీలకు చోటు

రానున్న రోజుల్లో గాంధీభవన్ నుంచి జిల్లా స్థాయిలో కమిటీలను ప్రకటించాలని ఏఐసిసి భావిస్తోంది. దీంతో పాటు పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. వివిధ కమిటీల్లో దాదాపు రెండు వందల మంది నేతలకు పార్టీ పదవులు లభించనున్నాయి. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ మెంబర్లు, జిల్లా అధ్యక్ష పదవులు భర్తీ కానున్నాయి. ఈ భర్తీలో భాగంగా వివిధ సామాజిక వర్గాలకు చోటు కల్పించాలని పిసిసి అధ్యక్షుడు భావిస్తున్నారు.

డిసిసి పనితీరుపై నివేదిక

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూర్పుపై పిసిసి అధ్యక్షుడు ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సమర్థవంతమైన వ్యక్తులను ఎంపిక చేయాలని పిసిసి భావిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో కొందరి డిసిసిల పనితీరు కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారిని ఆయా పదవులకు ఎంపిక చేయాలని ఇప్పటికే డిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్న వారి పనితీరు సర్వే నివేదిక అధిష్టానానికి పిసిసి పంపించిందని, అధిష్టానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వారిని మార్చాలని పిసిసి ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఏఐసిసి ఇచ్చే ఫైనల్ జాబితా ఆధారంగా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ బాధ్యతలను అప్పగించాలని పిసిసి యోచిస్తున్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News