న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలకు చెందిన వివిధ పార్టీల సభాపక్ష నాయకులతోపాటు ఇటీవల మణిపూర్‌ను సందర్శించిన 21 మంది ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని ఒక వినతిపత్రం సమర్పించారు. మణిపూర్ మంటలను చలార్చేందుకు జోక్యం చేసుకోవాలని వారు రాష్ట్రపతిని కోరారు.
అనంతరం రాష్టపతి భవన్ వెలుపల వారు విలేకరులతో మాట్లాడుతూ తమ మణిపూర్ సందర్శన వివరాలను రాష్ట్రపతి ముర్ముకు వివరించినట్లు తెలిపారు. మణిపూర్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని రాష్ట్రపతికి తెలిపినట్లు కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌదరి వివరించారు.
రెండు వేర్వేరు జాతులకు చెందిన ఇద్దరు మణిపురి మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయవలసిందిగా రాష్ట్రపతిని తాము కోరినట్లు చౌదరి చెప్పారు. మణిపూర్‌లో మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఈ చర్య ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చని వారు సూచించారు.
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలతోపాటు తీసుకోవలసిన పునరావాస చర్యలను, ఇతర పరిస్థితులను రాష్ట్రపతికి వివరించినట్లు చౌదరి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే మణిపూర్‌ను సందర్శించి రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస పార్టీ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.