Monday, December 23, 2024

కొవిడ్ వ్యాక్సిన్‌లో పరిశోధనలకు ఈ ఏడాది నోబెల్

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోం : వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2023 వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను వీరికి ఈ అవార్డు ప్రకటించారు. ఈమేరకు స్వీడన్ లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. గతేడాది మానవ పరిణామ క్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను స్వాంటె పాబో ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారం పాటు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం రోజున సాహిత్య విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి , అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

నగదు బహుమతి పెరిగింది…
నోబెల్ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గత ఏడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు అందజేయగా, ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లకు పెంచారు. స్వీడిష్ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News