Friday, November 22, 2024

మోసగాడిగా మారిన క్రికెటర్.. రిషబ్ పంత్ తో సహా అనేక మందికి టోపీ

- Advertisement -
- Advertisement -

లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన ఓ క్రికెటర్, ఆటకు స్వస్తి చెప్పి, దొంగాటకు తెరతీశాడు. లగ్జరీ హోటళ్లలో ఉంటూ, బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కు సైతం 1.63 కోట్ల రూపాయలకు టోపీ వేశాడు. చివరకు హాంకాంగ్ కు పారిపోతుండగా పోలీసులు అతని ఆట కట్టించారు.

అతని పేరు మృణాంక్ సింగ్. వయసు పాతికేళ్లు. గతంలో ఢిల్లీ జట్టు తరపున అండర్ 19 క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఆ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పి, మోసాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. కొంతకాలం క్రితం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో దిగిన మృణాంక్, వారం రోజుల పాటు హోటల్లో ఉన్నాడు. ఐదున్నర లక్షల బిల్లును చేతిలో పెట్టేసరికి, తనను స్పాన్సర్ చేస్తున్న ప్రముఖ సంస్థ ఆడిదాస్ ఆ బిల్లును చెల్లిస్తుందని చెప్పి జారుకున్నాడు. తర్వాత మృణాంక్ మోసగాడని తెలిసి, హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రెండేళ్ల క్రితం క్రికెటర్ రిషబ్ పంత్ కు కూడా మృణాంక్ టోపీ వేశాడు. తాను ఖరీదైన ఉత్పత్తులను విక్రయిస్తూంటానని   నమ్మించి పంత్ నుంచి 1.63 కోట్ల రూపాయలు వసూలు చేసి మాయమయ్యాడు. దీనిపై పంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు మృణాంక్ తల్లిదండ్రులను సంప్రదిస్తే, తమ కొడుకుతో తాము తెగదెంపులు చేసుకున్నట్లు చెప్పారు.  డిసెంబర్ 25న మృణాంక్ ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు కూడా తాను కర్ణాటకకు చెందిన అడిషనల్ డీజీపీనని, తన పేరు అలోక్ కుమార్ అనీ చెప్పి తప్పించుకోబోయాడు. కానీ పోలీసులకు మృణాంక్ గురించి బాగా తెలిసి ఉండటంతో అతని ఆట కట్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News