ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అస్సలు కలిసి రావడం లేదు. ఆడిన ఐదు మ్యాచుల్లో మొదటి మ్యాచ్ మాత్రం గెలిచి ఆ తర్వాత మ్యాచుల్లో వరుసగా ఓటమిపాలైంది. ఇప్పుడు ఆ జట్టులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి గాయం కావడంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. అతని స్థానంలో ఎంఎస్ ధోనీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ విషయాన్ని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. రుతురాజ్ మోచేతి ఎముక విరిగిందని.. దాంతో అతను సీజన్ నుంచి తప్పుకున్నట్లు ఫ్లెమింగ్ తెలిపారు. అతని స్థానంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. చెన్నై తన తర్వాతి మ్యాచ్ శుక్రవారం కెకెఆర్‌తో ఆడనుంది.
అయితే ధోనీకి తిరిగి కెప్టెన్సీ అప్పగించడంతో ‘తలా’ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ధోనీ కెప్టెన్సీలో తమ జట్టు మళ్లీ పుంజుకుంటుందని వాళ్లు ఆశపడుతున్నారు. 2008 నుంచి 2023 వరకూ ధోనీ చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని సారథ్యంలో చెన్నై ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.