మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ పరువు నష్టం కేసులో ఓ ఐపిఎస్ అధికారికి కోర్టు జైలుశిక్ష విధించింది. 2013 ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి సంపత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. చెన్నైలో ఓ టీవీ ఛానల్ లో సంపత్ కుమార్ మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాలను పక్కనపెట్టి ధోని బెట్టింగ్‌కు, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి.రిటైర్డ్ ఐపిఎస్ ఆరోపణలతో సీరియస్ అయిన ధోని.. మద్రాసు కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐపిఎస్ ఆధికారితోపాటు సదరు టీవీ ఛానల్‌పై 2014లో ధోని కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనకు రూ.100 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని, తన పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రకటనలు జారీ చేయకుండా నిషేధించాలని కోర్టును కోరారు.
అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ కేసును శుక్రవారం విచారించిన కోర్టు.. రిటైర్డ్ ఐపిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ధోనీ పరువుకు నష్టం కలిగించే ప్రకటనలు చెయ్యొద్దని రిటైర్డ్ ఆఫీసర్‌తో పాటు మీడియాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి సంపత్ కుమార్‌కు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది.
2013 ఐపిఎల్ బెట్టింగ్ స్కాండల్ సంచలనంగా సృష్టించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు బిసిసిఐ బ్యాన్ చేసింది.