న్యూస్‌డెస్క్: టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడేళ్ల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ నడుపుతూ ఆయన తన అభిమానుల్లో సంతోషం నింపారు. తన స్వస్థలం రాచీ సమీపంలోని సంబో ప్రాంతంలో గల తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ నడుపుతూ ధోనీ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 33 లక్షల మంది దీన్ని వీక్షించగా 70 వేల మంది నెటిజన్లు తమ కామెంట్లతో ధోనీని ప్రశంసలతో ముంచెత్తారు.
సోషల్ మీడియాలో ధోనీకి సంబంధించిన పోస్టు పడి రెండేళ్లు దాటింది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్న ధోనీ తపన ఈసారి అందరికీ సాధ్యం కాని ట్రాక్టర్ డ్రైవింగ్‌పైన పడింది.
మూడేళ్ల క్రితం ధోనీ రూ. 8 లక్షలతో మహీంద్ర స్వరాజ్ ట్రాక్టర్ కొనుగోలు చేశారు. అప్పట్లో దీనిపై మహీంద్ర గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్విటర్ వేదికగా ధోనీని అభినందించారు. ఇది సరైన నిర్ణయమంటూ ఆయన ప్రశంసించారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రజలకు ధోనీ పరిచయం చేయడం ఇదే మొదటిసారి. ఈ వ్యవసాయ క్షేత్రంలో పండ్లు, కూరగాయల తోటలను ధోనీ పెంచుతున్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రంలో ఆవాలు, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, స్ట్రీబెర్రీస్, అల్లం, క్యాప్సికం తదితర కూరగాయలను ఆయన పండిస్తున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతిలో వీటిని పండిస్తున్నారు. ఇక్కడ పండే పండ్లు, కూరగాయలను స్థానిక మార్కెట్లతోపాటు ఇతర నగరాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ధోనీ వ్యవసాయ క్షేతంలో సుమారు 80 ఆవులు కూడా ఉన్నాయి. వీటి పాలను స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇవే కాకుండా కడక్‌నాథ్ జాతికి చెందిన కోళ్లను కూడా ఇక్కడ పెంచుతున్నారు.
రాంచిలో ఉన్న సమయంలో ధోని తన భార్య సాక్షి, తన బాల్యస్నేహితుడు సీమంత్ లోహానితో కలసి తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. సాక్షి మాత్రం తరచు తమ వ్యవసాయ క్షేత్రానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
#viralvideo : MS Dhoni was seen plowing the field with a tractor, this desi style of Mahi won the hearts of the fans…#MSDhoni #Dhoni #cricket #TeamIndia pic.twitter.com/feofNs9j73
— News18 Ladakh (@News18Ladakh) February 10, 2023