పంజాబ్‌తో మ్యాచ్ టాస్ సందర్భంగా చెప్పకనే చెప్పిన మిస్టర్ కూల్
దుబాయి: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపిఎల్‌నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోనున్నాడా? గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ధోనీయే ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడతానో లేదో అని అతను అనడం గమనార్హం. అయితే చెన్నై టీమ్‌తోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు.
‘ వచ్చే సీజన్‌లోను మీరు నన్ను పసుపు రంగు జెర్సీలోనే చూస్తారు. అయితే సిఎస్‌కెకు అడతానో లేదో తెలియదు. చాలా అనిశ్చిత పరిస్థితులు రాబోతున్నాయి. రెండు కొత్త టీమ్‌లు రాబోతున్నాయి. రిటెన్షన్ పాలసీ ఎలా ఉండబోతుందో తెలియదు’ అని ధోనీ అన్నాడు. ఈ మధ్య ఓ వర్చువల్ మీట్‌లో ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ తాను చెన్నై లోనే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడతానని ధోనీ చెప్పడం తెలిసిందే. అయితే అంతలోనే ఒక ప్లేయర్‌గా తనకిదే చివరి సీజన్ కావచ్చన్న హింట్ ఇవ్వడం గమనార్హం. ఈ నెలలోనే ఐపిఎల్‌లో చేరబోయే రెండు కొత్త టీమ్‌లు ఏవోతేలిపోనుంది. ఆతర్వాత మెగా వేలం జరుగుతుంది. ఒక్కో టీమ్ ఎంత మంది ఆటగాళ్లను రిటేన్ చేసుకోవచ్చు, రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించవచ్చనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.