నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తోంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. గురువారం చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే సాంగ్‌ని లాంచ్ చేశారు. స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే, కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకుల భావోద్వేగ అనుబంధంను సున్నితంగా చిత్రీకరించిన మేలోడిక్ మాస్టర్ పీస్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ “కళ్యాణ్ రామ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశాడు. 18వ తారీఖున మీరంతా చూస్తారు. మీరంతా మెచ్చుకుంటారు.
అంత అద్భుతంగా చేశాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నిజాయితీగా పని చేశాం. ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “ఒక అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసిన సరిపోదు. అదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది”అని తెలిపారు. డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ “మనం పుట్టగానే అమ్మ ప్రతి బర్త్ డేకి కేక్ కట్ చేస్తుంది. అది సెలబ్రేషన్. మనం పెద్దయ్యాక అమ్మ బర్త్ డేని గుర్తు పెట్టుకుని కేక్ కట్ చేయాలి. అది ఎమోషన్. అదే ఈ సినిమాలో చూపించాలనుకున్నాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా, హీరోయిన్ సాయి మంజ్రేకర్, పృథ్వీ, రఘురాం, రావూరి వెంకటస్వామి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తమ్మి రాజు, శ్రీకాంత్ విస్సా పాల్గొన్నారు.