రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బుధవారం తెల్ల వారుజామున ఎస్వోటీ పోలీసుల దాడి చేసి ముజ్రా పార్టీ భగ్నం చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఏత్‌బార్‌పల్లి గ్రామ రెవెన్యూలో హాలిడే ఫార్మ్‌హౌస్‌లో పార్టీ పేరుతో అశ్లీలంగా డ్యాన్సులు చేస్తున్నారని సమాచారం అందడంతో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.30 లకు ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు. ముజ్రా పార్టీని భగ్నం చేసిన ఎస్వోటీ పోలీసులు ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్థానిక మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ఒకరి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారని సమాచారం. అయితే పోలీసులు ఆ ఫాం హౌస్‌లో పెద్ద ఎత్తున మద్యం, 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.పార్టీలో యువతులు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడంతో ముజ్రా పార్టీ అని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిర్వాహకులు ఈ బర్త్‌డే పార్టీ కోసం పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చారని ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు పార్టీ నిర్వాహకులు, ఫాంహౌస్ యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్టయిన యువకులంతా పాతబస్తీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించే దిశగా పోలీసుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలి కాలంలో పలు ఫాంహౌస్‌లు, రిసార్ట్‌లు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయన్న ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు పోలీసు నిఘాను ముమ్మరం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపారు. సమాచారం వచ్చిన వెంటనే ఆయా బృందాలు రంగంలోకి దిగే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ రకమైన ముజ్రా పార్టీలు, డ్రగ్స్ అవకాశమిచ్చే విధంగా చర్యలను ఎన్నటికీ ప్రోత్సహించజాలమని పోలీసు అధికారులు తెగేసి చెబుతున్నారు. మరో వైపు పార్టీ నిర్వాహకుడిని సైతం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.
ముజ్రాపార్టీలో భాగంగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అందరికీ వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, హాలీడే ఫాంహౌస్‌లో అబ్దుల్ లుక్కాస్ అనే వ్యక్తి బర్త్‌డే పార్టీ నిర్వహించారని, ఈ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహించారని మెయినాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. సింగర్లు రీనా, బాబు అధ్వర్యంలో ఈ పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు. రీనా కోల్‌కతాకు చెందిన మహిళగా, గత ఐదు సంవత్సరాలుగా నగరంలో ఉంటూ పార్టీలలో పాటలు పాడుతున్నారన్నారు. గతంలో ఇలాంటి పార్టీలలో రీనా పట్టుబడిందని పోలీసులు వెల్లడించారు.