ప్రపంచ సంపన్నుల జాబితాలో ఒక స్థానం పైకి..
కరోనా కాలంలోనూ భారత్‌లో 40 మంది కొత్త బిలియనీర్లు
రెట్టింపైన అదానీ సంపద, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంతో పోరాడుతున్న నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారుల సంపద మాత్రం పెరుగుతూనే ఉంది. కరోనా సమయంలో దేశంలో కొత్త బిలియనీర్లు 40 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో మొత్తం బిలియనీర్ల సంఖ్య 177 కు పెరిగింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, 2020లో ముకేశ్ అంబానీ సంపద 24 శాతం వృద్ధిని సాధించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ 8వ స్థానంలో ఉన్నారు. నివేదిక ప్రకారం, అంబానీ మొత్తం ఆస్తులు రూ.6.1 లక్షల కోట్లు (83 బిలియన్ డాలర్లు)గా అంచనా వేశారు. ఈ జాబితాలో అంబానీ గత సంవత్సరం 9వ స్థానంలో ఉండగా, అప్పుడు ఆయన మొత్తం ఆస్తులు 67 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.4.8 లక్షల కోట్లు ఉన్నాయి.
గౌతమ్ అదానీ సంపద రెట్టింపు
ఈ నివేదిక ప్రకారం, గుజరాత్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద వేగంగా పెరిగింది. 2020లో ఆయన సంపద రూ.2.34 లక్షల కోట్లతో (32 బిలియన్ డాలర్లు) రెట్టింపు అయింది. దీంతో ఆయన సంపన్నుల జాబితాలో 20 స్థానాలను ఎగబాకి, ప్రపంచంలో ధనవంతుల్లో 48వ స్థానానికి చేరారు. ఐటి కంపెనీ హెచ్‌సిఎల్‌కు చెందిన శివ్ నాడార్ రూ.1.98 లక్షల కోట్ల (27 బిలియన్ డాలర్లు)తో మూడో అత్యంత సంపన్న భారతీయుడుగా నిలిచారు.
నంబర్ వన్‌గా ఎలోన్ మస్క్
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్ మొదటి స్థానం దక్కించుకున్నారు. ఆయన ఆస్తులు రూ.14.46 లక్షల కోట్లు (197 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. నివేదిక ప్రకారం, 49 ఏళ్ల మస్క్ ఆస్తి గత సంవత్సరం 328% పెరిగింది. అదే సమయంలో అమెజాన్ మొత్తం ఆస్తులు 2020లో 35% పెరిగాయి. జెఫ్ బెజోస్ నికర విలువ రూ.13.88 లక్షల కోట్లు (189 బిలియన్ డాలర్లు), జాబితాలో ఆయన రెండవ స్థానంలో ఉన్నారు.
దేశంలో టాప్5 ధనవంతులు
n ముకేశ్ అంబానీ రూ.6.1 లక్షల కోట్లతో ఎనిమిదో స్థానం
n గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ రూ.2.34 లక్షల కోట్లతో 48వ స్థానం
n శివ్ నాడార్ అండ్ ఫ్యామిలీ రూ.1.94 లక్షల కోట్ల ఆస్తులతో 58 వ స్థానం
n ఆర్సెలర్ మిట్టల్ రూ.1.4 లక్షల కోట్లతో 104 వ స్థానం
n సైరస్ పూనావాలా రూ.1.35 లక్షల కోట్ల ఆస్తులతో 113వ స్థానం
ప్రపంచంలో టాప్5 ధనవంతులు
n ఎలోన్ మస్క్ రూ.14.46 లక్షల కోట్లు
n జెఫ్ బెజోస్ రూ.13.88 లక్షల కోట్లు
n బెర్నార్డ్ ఆర్నాల్ట్ రూ.8.37 లక్షల కోట్లు
n బిల్ గేట్స్ రూ.8.07 లక్షల కోట్లు
n మార్క్ జుకర్‌బర్గ్ రూ.7.42 లక్షల కోట్లు
Mukesh Ambani Continues to top in India Rich List 2021