న్యూఢిల్లీ : భారత అటార్నీ జనరల్‌గా మళ్లీ పదవిని చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి ఆదివారం తిరస్కరించారు. గతంలో ఒకసారి భారత అటార్నీజనరల్‌గా పనిచేసిన రోహత్గి అక్టోబర్ 1 నుంచే మళ్లీ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఈ మేరకు కేంద్రం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్టు కూడా అనేక వాదనలు వినిపించాయి. అయితే తాజాగా వాటికి బ్రేక్ వేస్తూ అందుకు తాను సుముఖంగా లేనని ఆదివారం ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను కాదనడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం లేదని, మరోసారి ఆ పదవిని చేపట్టేందుకు తాను సుముఖంగా లేనని స్పష్టం చేశారు. గతంలో ఏజీగా పనిచేసిన రోహత్గి 2017లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడంతో 15 వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను నాడు ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏజీ వేణుగోపాల్ పదవీకాలాన్ని పొడిగించారు.
అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30 తో ముగుస్తుంది. ఆయన ఈ పదవిలో దాదాపు 5 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 2020 లోనే వేణుగోపాల్ మూడేళ్ల పదవీ కాలం ముగిసింది. అప్పటికే ఆయన వయస్సు దాదాపు 89 ఏళ్లు. తన వయసును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతిని ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్ కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం ఆయనను మరో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగమని అభ్యర్థించడంతో ఆయన కొనసాగారు. ఆ తరువాత రోహత్గికి ఆఫర్ ఇచ్చారు. కానీ రోహత్గి ఆదివారం ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రోహత్గి అత్యంత సన్నిహితుడు. 2014లో అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులయ్యారు. ప్రభుత్వ వైఖరిపై అసమ్మతి వ్యక్తం చేస్తూ 2017 జూన్ రెండో వారంలో ఏజీ పదవికి రోహత్గీ రాజీనామా చేశారు. గుజరాత్ అల్లర్లుతోసహా అనేక కీలకమైన కేసుల్లో తనదైనశైలిలో ప్రభుత్వం తరఫున వాదించారు. నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ తదితర కేసుల్లో వాదించి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో నౌకలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ కేసులో డిఫెన్స్ న్యాయవాదిగా వాదించారు.