Monday, December 23, 2024

భూఆక్రమణలో బహుళజాతి సంస్థలు!

- Advertisement -
- Advertisement -

2007-08 లో వచ్చిన ఆహార సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ యూనియన్ దేశాలు, కొన్ని అరబ్ దేశాలు, ఆసియా దేశాలు, బహుళ జాతి సంస్థలు భవిష్యత్తులో రాబోయే ఆహార సంక్షోభం దృష్టిలో పెట్టుకుని, వ్యాపార ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున భూసమీకరణకు పాల్పడుతున్నాయి. లక్షలాది ఎకరాలు లీజు, కొనుగోల్ల పేరుతో స్థానిక దేశాల ప్రభుత్వాల నుంచి పొందుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల భూములు వీటి పరమవుతున్నాయి. ఈ దేశాల మొత్తం భూమిలో 2 నుంచి 10 శాతం మధ్య మాత్రమే అధికారికంగా రైతులు భూమి కలిగి ఉన్నారని 2003 ప్రపంచ బ్యాంకు అధ్యయనం అంచనా వేసింది.

భూమిపై అత్యధికంగా ప్రభుత్వ యాజమాన్యం, సంక్లిష్టమైన రిజిస్ట్రేషన్ విధానం, ఆ దేశాల ఆచార వ్యవస్థలు సరిపోతాయని ఆ దేశాల ప్రజలు భావించటం అందుకు కారణం. సామ్రాజ్యవాదులు, బహుళ జాతి సంస్థలకు లొంగిన ఆఫ్రికన్ దేశాల పాలకులు, తమ ఆధీనంలో భూములను సంపన్న దేశాలకు, బహుళజాతి సంస్థలకు అతి చవకగా అమ్మటం లేదా లీజుకి ఇచ్చి వాటి పరం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ పాలసీ రీసెర్చ్ (ఐఎఫ్‌పిఆర్) 2009 అంచనా వేసిన ప్రకారం 2006 నుంచి వెనకబడిన దేశాల్లో 15 నుంచి 20 మిలియన్ల హెక్టార్ల భూములు అన్యాక్రాంత మైనాయి. జనవరి 2013 నాటికి ల్యాండ్ పోర్టల్ మ్యాట్రిక్ డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 49 మిలియన్ హెక్టార్ల భూ ఒప్పందాలు జరిగాయి. 2011 ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 56 మిలియన్ హెక్టార్ల భూములు చేతులు మారాయి. 2012లో ఆఫ్రికాలోనే 63 మిలియన్ల హెక్టార్ల భూమి పరాయీకరణ చెందింది. అదే సంవత్సరం Grain (గ్రెయిన్) ప్రచురించిన డేటా ప్రకారం 35 మిలియన్ హెక్టార్ల భూమి ఆఫ్రికా దేశాల నుంచి కొనుగోళ్లు జరిగాయి. 1990- 2011 మధ్య వెస్ట్ బ్యాంక్ (పాలస్తీనా) లో 195 కిలోమీటర్ల భూమిని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నది.

ఈ విధంగా ప్రపంచంలో పరాయీకరణ చెందిన భూమి 4 కోట్ల హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంది.
సూడాన్‌లో అమెరికా సంస్థలు, ఆర్క్ క్యావ్, నైల్ ట్రేడింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఇంక్ మధ్య 10 లక్షల హెక్టార్ల భూమి తీసుకున్నాయి.చైనా- కొలంబియా మధ్య నాలుగు హెక్టార్ల భూబదలాయింపు ఒప్పందం జరిగింది. టాంజానియాలో 3 లక్షల 25 వేల హెక్టార్ల భూమి లీజుకి బహుళజాతి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. పాకిస్తాన్‌లో యుఎఇ 3 లక్షల 24 హెక్టార్ల భూమిని కొనుగోళ్లు చేసింది.

అర్జెంటీనాలో చైనా పెట్టుబడిదారులచే 3 లక్షల 20 వేల హెక్టార్ల భూముల కొనుగోళ్ల ఒప్పందం జరిగింది. టాంజానియాలో భారతీయ పెట్టుబడులు 3 లక్షల హెక్టార్లలో ఉన్నాయి. గాబన్‌లో ఓలమ్ ఇంటర్నేషనల్ మూడు లక్షల ఎకరాలు, నైజీరియాలో 6 లక్షల ఎకరాలు లీజుకి తీసుకుంది. ఈక్వటోరియల్ పామాయిల్ ఒప్పందం లక్షా 69 వేల హెక్టార్లు. యునైటెడ్ కింగ్‌డమ్ 19,72,010 హెక్టార్లు, ఫ్రాన్స్ 6,29,953 హెక్టార్లు, ఇటలీ 6,15,674 హెక్టార్లు, ఫిన్లాండ్ 5,03,953 హెక్టార్లు, నెదర్లాండ్ 4,14,974 హెక్టార్లు, జర్మనీ 3,09,566 హెక్టార్లు, బెల్జియం 2,51,808 హెక్టార్లు, లక్సెంబర్గ్ 1,57,914 హెక్టార్లు, స్పయిన్ 1,36,504 హెక్టార్లు, రుమేనియా 1,30,000 హెక్టార్లు, స్వీడన్ 77,329 హెక్టార్లు, డెన్మార్క్ 31,460 హెక్టార్లు, ఆస్ట్రియా 21,000 హెక్టార్లు, ఎస్టోనియా 18,800 హెక్టార్ల భూములు కొనుగోలు చేశాయి.

ప్రపంచ బ్యాంక్ సెప్టెంబర్ 2010లో ప్రచురితమైన నివేదికలో భూమి లీజు కోసం భూ సేకరణ పరిధికి సంబంధించి 4 కోట్ల, 60 లక్షల హెక్టార్లుగా ఉంది (110 కోట్ల ఎకరాలు) ఇందులో మూడింట రెండు వంతులు సబ్ సహారా ఆఫ్రికాలోనే ఉంది. ల్యాండ్ డేటా, గ్రెయిన్ డేటా బేస్ ప్రకారం అమెరికా, బ్రిటన్‌లు అంతర్జాతీయ భూసేకరణలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నాయి. భూ లీజు ఒప్పందాల్లో అమెరికా, యుఎఐ, చైనాలు, 12%, భారత్ 8%, ఈజిప్టు, యుకెలు 6%, దక్షిణ కొరియా 5%, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, సింగపూర్, మలేసియా 4% కలిగి ఉన్నాయి. విదేశాలకు భూమిని పూర్తిగా విక్రయించడంపై అనేక దేశాల ముఖ్యంగా ఆఫ్రికా దేశాల రాజ్యాంగాల నిషేధం కారణంగా కొనుగోళ్ల కంటే దీర్ఘకాలిక లీజులే ఎక్కువగా ఉన్నాయి.

భారతీయ పెట్టుబడిదారులు లక్ష హెక్టార్లలో, హెక్టార్ లీజుకి సంవత్సరానికి నాలుగు అమెరికా డాలర్లు చెల్లిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్, సూడాన్‌లో లక్షా 5 వేల హెక్టార్లకు సంవత్సరానికి లీజు కింద లక్షా 25 వేల (హెక్టార్‌కు ఒక డాలర్ కంటే కొంచెం ఎక్కువ) అమెరికా డాలర్లు చెల్లిస్తున్నాడు. పెరూలో ఒక దక్షిణ కొరియా పెట్టుబడిదారుడు హెక్టార్‌కు 0.80 డాలర్లు చెల్లించాడు. ఈ లీజు రేటుని గమనిస్తే వెనుకబడిన దేశాల భూములను లీజు పేరుతో సంపన్న దేశాలు, ఆ దేశాల పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు ఎలా కాజేస్తున్నది వెల్లడవుతుంది.

భూముల కొనుగోళ్ల కోసం కొన్ని దేశాలు, బహుళ జాతి సంస్థలు 100 బిలియన్ల అమెరికా డాలర్ల నిధులు కేటాయించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 2011లో ఒక వ్యవసాయ కన్సల్టెన్సీ హైక్వెస్ట్ రాయటర్‌తో మాట్లాడుతూ వ్యవసాయంలో ప్రైవేట్ మూల ధన పెట్టుబడి 2010లో 2.5 బిలియన్ అమెరికా డాలర్ల నుంచి 3 బిలియన్ల డాలర్లు పెరుగుతుందనే అంచనాగా చెప్పి, ముందుముందు ఇంకా బాగా ఈ మూలధనం పెరుగనున్నదని చెప్పాడు. విదేశాలకు, బహుళజాతి సంస్థలకు భూములు అమ్మేందుకు, లీజుకి ఇచ్చేందుకు ఆఫ్రికా దేశాలు భూసేకరణ చేయడం వలన రైతులతో పాటు, స్థానిక ప్రజలకు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారు. పెట్టు బడి కంపెనీలు భూమిని కలిగి ఉండి పెద్ద ఎత్తున తమ వ్యవసాయ ప్లాంట్లలో రైతులను కార్మికులుగా నియమించుకొంటున్నాయి.

ఉద్యోగ కల్పనకు, దేశాభివృద్ధికి ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం దాట వేస్తున్నాయి. బహుళజాతి సంస్థలు ఇచ్చే పరిహారం వారి జీవనోపాధి పునరుద్ధరణకు ఏమాత్రం చాల లేదు. ఫలితంగా తమ భూముల్లోనే రైతు కూలీలుగా మారారు. లభించే కూలీతో కుటుంబ అవసరాలు తీరక బాధలు పడుతున్నారు. భూములు కోల్పోయి ఉపాధి లేక తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆఫ్రికా దేశాల్లోని పేదలు, రైతులు పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, బహుళ జాతి సంస్థలపై ఆంక్షలు విధించాలని, విదేశాలకు భూములు విక్రయించ రాదని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆందోళన ఫలితంగా భూముల కేటాయింపుల్లో స్వల్ప మార్పులు చేయక తప్పలేదు. భూముల పరాయీకరణ ఆపాలనే ప్రజా ఉద్యమ నినాదం ఆఫ్రికా తదితర దేశాల పాలకులకు వణుకు పట్టించేలా ముందుకు సాగాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News