Wednesday, January 22, 2025

హెచ్ 1 బి వీసాల్లో పలు మోసాలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలకు అత్యంత కీలకమైన హెచ్ 1 బి వీసాల కంప్యూటరైజ్డ్ లాటరీ విధానంలో పలు అక్రమాలు, భారీ మోసాలను అమెరికా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ నేపథ్యంలో వెంటనే ఈ వీసా లాటరీ సిస్టమ్‌ను తప్పిదాలు జరగకుండా ఆధునీకరించాలని నిర్ణయించారు. కొన్ని కంపెనీలు తమ స్వలాభాపేక్షతో తాము ఎంచుకునే నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఈ లాటరీ సిస్టమ్‌లో హెచ్ 1 బి వీసాలు దక్కేలా చేసుకుంటున్నాయని ఫెడరల్ ఏజెన్సీ నిర్థారించుకుంది. దీనితో వెంటనే ఈ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రఖ్యాత కంపెనీలు కొన్ని భారత్, చైనాకు చెందిన ఆశ్రిత యువ ప్రతిభావంతులకు హెచ్ 1 వీసాలు తేలిగ్గా దక్కేలా చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) అసాధారణ రీతిలో ప్రకటన వెలువరించింది. ప్రతి ఏటా హెచ్ 1 బి వీసాల కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటారు.

అయితే లాటరీ విధానంలో కొందరిని ఎంపికచేసి వీటిని జారీ చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఈ లాటరీ విధానంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పదే పదే ఒకే దరఖాస్తుదారుతో ఈ లాటరీల్లోకి పేర్లను నమోదు చేయించడం ఎక్కువ వీసాలు తమ సంస్థలకు దక్కేలా చేయడం వంటి పరిణామాలు జరిగాయి. ప్రత్యేకించి 2023 , 2024 ఆర్థిక సంవత్సరాలలో ఈ ఇటువంటి మోసాలను గుర్తించారు. దీనిపై పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతోంది. అయితే అతి కొద్ది కంపెనీలు ఇటువంటి అక్రమాలకు దిగుతున్నాయని, ఏది ఏమైనా అవకతవకాలకు వీల్లేకుండా చేసేందుకు ఈ వ్యవస్థను అధునాతనం చేయాలని సంకల్పించారు. త్వరలోనే అత్యంత సమగ్ర రీతిలో ఉండే అధునాతన హెచ్ 1 బి నిబంధనల ప్రక్రియ లాటరీ విధానాలు ప్రవేశపెడుతామని వీసా సంస్థ తెలిపింది. ఈ ఏడాది గతంతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో హెచ్ 1 బి వీసాలకు రిజిస్ట్రేషన్లు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది హెచ్1 బి వీసాల కోసం 7,80,884 దరఖాస్తులు లాటరీ కంప్యూటర్ విధానం పరిధిలోకి వచ్చాయి. తప్పుడు సమాచారం, ఒక్కరి పేరుతో అనేక వీసా దరఖాస్తులు రావడం వంటి అక్రమాలపై తగు విధంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News