ములుగు: జిల్లాలోని వెంకటాపురం మండలంలో విరభద్రవరంలోని ముత్యం దార జలపాతం వీక్షించేందుకు బుధవారం సుమారుగా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో.. ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 80 మంది అడవిలోకి వెళ్ళగా తిరుగు ప్రయాణంలో వాగు ఉధృతి పెరగడంతో దాటలేక అక్కడే చిక్కుకుపోయారు. చీకటి పడడంతో నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. భయభ్రాంతులకు గురైన వారు వెంటనే డయల్ 100కు ఫోన్ చేశారు. ఫోన్ లో వారికీ జిల్లా ఎస్పీ తగు జాగ్రతలు చెప్పి హుటాహుటిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను, స్థానిక పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐ లను అప్రమత్తం చేశారు.
వెంటనే సంఘటనాస్థలాన్ని చేరుకుని వారిని కాపాడేందుకు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు 80 మందిని సురక్షితంగా కాపాడారు. అనంతరం వారికి ఆహారం మందులు అందజేశారు. కాగా ఇందులో ఆడవారు ఎవరూ లేరు. అందరూ యువకులే. ఒకరికి తెలు కుట్టగా చికిత్స చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున దయచేసి ఎవరూ కూడా నిషేధించబడ్డ ప్రాంతాలలో పర్యటించరాదని, అత్యవసరమైతే తప్ప ఎవరు ఇంటి నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.