Monday, December 23, 2024

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం

- Advertisement -
- Advertisement -

Mulugu Ramalingeswara Siddhanti Passes away

 

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్య పండితులు,శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతీష్య సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి ఆదివారం సాయంత్రం శివైక్యం చెందారు. ఈక్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధాంతికి ఆదివారం సాయంత్రం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే రామలింగేశ్వర సిద్ధాంతి మార్గమద్యంలో తుది శ్వాస విడిచినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. పలు చానెళ్లలో వార ఫలాలు చెబుతూ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఎంతో మందికి చేరువయ్యారు. ములుగు సిద్ధ్దాంతి చెప్పే రాశి ఫలాలను కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లో ఉంటే తెలుగు వారు కూడా ఎంతగానో విశ్వసిస్తుంటారని ‘ములుగు డాట్ కామ్’ నిర్వహకులు కొడుకుల సోమేశ్వరరావు తెలిపారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేశారని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాల వారికి జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలియజేశారన్నారు. ములుగు సిద్ధాంతి శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారన్నారు. ప్రతిసంవత్సరం ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నామని, ఈ సందర్భంగా చానెల్ నిర్వాహకులు తెలిపారు. ములుగు సిద్ధాంతి గారి ఆశయాలను, వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళతామని, వారి దివ్య ఆశీస్సులతో ఆయన తలపెట్టిన పనులు తమవంతుగా విజయవంతం చేస్తామని కుటుంబ సభ్యులు తెలియజేసారు. ఈ నేపథ్యంలో ములుగు సిద్ధాంతి రామలింగేశ్వర వరప్రసాద్ అంత్యక్రియలు సోమవారం నాడు మహాప్రస్థానంలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News