Thursday, January 23, 2025

ఉద్యమ ధీరోదాత్తుడు జగదీశ్

- Advertisement -
- Advertisement -

వరంగల్  : ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మడమ తిప్పని ఉద్యమ నాయకుడని… సిఎం కెసిఆర్ తమ్ముడిగా చురుకైన కార్యకర్తగా చివరి వరకు పోరాడిన తెలంగాణ సైనికుడిగా…ఉద్యమ ధీరోదాత్తుడు కుసుమ జగదీశ్ అని ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని మల్లంపల్లి గ్రామంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ పార్థివదేహాన్ని మంత్రి కెటిఆర్ సోమవారం ఉదయం తన మంత్రి వర్గ సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కుసుమ జగదీశ్ మరణంపై భావోద్వేగపూరితమైన ప్రసంగాన్ని చేశారు. సుశిక్షుతుడైన కార్యకర్తగా, తెలంగాణ సైనికుడిగా, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమ్ముడిగా తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి పని చేశాడని అన్నారు.

ఆయన తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. జెడ్పీ చైర్మన్‌గా పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారని మొన్నటి కార్యక్రమంలో కూడా దగ్గరుండి చురుకుగా అన్ని కార్యక్రమాలు చేశారని అన్నారు. ఆయన హఠాన్మరణం ఎంతగానో బాధించిందన్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఎంతో ఆవేదనకు గురవుతున్నందున ఆవేదన పంచుకోవడానికి ఇక్కడి వచ్చి పంచుకోవడం జరుగుతుందన్నారు. జగదీశ్ ఆత్మ ఎక్కడ ఉన్నా ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఉద్యమాల్లో, రాజకీయాల్లో పేరు సంపాదించుకోవాలనుకున్నాడే తప్ప ఆస్తులు కూడబెట్టుకోలేదన్నారు. ఆయన లేని లోటును కుటుంబానికి తీర్చలేనప్పటికీ ఆయన కుటుంబానికి శాశ్వతంగా అండగా ఉంటామన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాటం చేసి రెండు దశాబ్దాలుగా టిఆర్‌ఎస్ పార్టీకి వెన్నుదండుగా నిలిచాడని అన్నారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెచ్చిన పార్టీ జెండాను జగదీశ్ మృతదేహంపై కప్పి మంత్రి కెటిఆర్, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు…
ములుగు జెడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీశ్ అంత్యక్రియల్లో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర మంత్రులు సత్యవతిరాథోడ్, జగదీశ్వర్‌రెడ్డి, అజయ్‌కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోశ్‌కుమార్, రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్, రేగ కాంతారావు,

గాదరి కిశోర్‌కుమార్, కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, జిల్లా, మండల, కార్పొరేషన్ చైర్మన్‌లు, పార్టీ ప్రతినిధులు అంతిమయాత్రలో పాల్గొని చివరి వరకు ఉండి కన్నీటి వీడ్కోలు పలికారు. కుసుమ జగదీశ్ స్వగ్రామమైన మల్లంపల్లిలో అంత్యక్రియలకు ములుగు జిల్లాతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా, ఇతర జిల్లాల పార్టీ కార్యకర్తలు, నాయకులు వేలాదిగా రావడంతో మల్లంపల్లి శోకసంద్రంలోకి వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News