Thursday, November 21, 2024

రంజీ ఛాంపియన్ ముంబై

- Advertisement -
- Advertisement -

ముంబై: అగ్రశ్రేణి దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై విజయం సాధించింది. విదర్భతో జరిగిన ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో తన ఖాతాలో 42వ రంజీ ట్రోఫీని జత చేసుకుంది. 538 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విదర్భ గురువారం ఐదో, చివరి రోజు 368 పరుగులకు ఆలౌటైంది. 248/5 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన విదర్భ ఆరంభంలో బాగానే ఆడింది. కెప్టెన్‌అక్షయ్ వాడ్కర్, హర్ష్ దూబెలు ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం వైపు నడిపించారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇటు అక్షయ్, అటు దూబె కుదురుగా ఆడడంతో విదర్భ కోలుకున్నట్టే కనిపించింది. అసాధారణ పోరాట పటిమను కనబరిచిన అక్షయ్, దూబెలు ముంబై బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఇదే సమయంలో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అక్షయ్ 119 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102 పరుగులు సాధించాడు. అయితే కీలక సమయంలో ముంబై స్టార్ తనూష్ కొటియాన్ అద్భుత బంతితో అక్షయ్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో 130 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత విదర్భ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. తనూష్ కొటియాన్ అద్భుత బౌలింగ్‌తో విదర్భ చివరి వరుస బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్ పంపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్ష్ దూబె 128 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. ఆదిత్య సర్వాటె (3), యశ్ ఠాకూర్ (6), ఉమేశ్ యాదవ్ (6) సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. దీంతో విదర్భ ఇన్నింగ్స్ 134.3 ఓవర్లలో 368 పరుగుల వద్దే ముగిసింది. ముంబై బౌలర్లలో తనూష్ కొటియాన్ నాలుగు, ముషీర్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లను పడగొట్టారు.

షమ్స్ ములాని, ధావల్ కులకర్ణిలకు ఒక్కో వికెట్ దక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌటైంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబైకి రంజీ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్ మ్యాచ్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన కనబరిచిన తనూష్ కొటియాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.

కాసుల డబుల్ బొనాంజా..
ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీని గెలుచుకున్న ముంబై టీమ్‌పై కాసుల వర్షం కురిసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీని సాధించిన జట్టుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) భారీ నజరానాను ప్రకటించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబై ఇప్పటికే రికార్డు సృష్టించింది. తాజా విజయంతో ముంబై ఇప్పటి వరకు 42 సార్లు రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కూడా ముంబైకి దారిదాపుల్లో కనిపించడం లేదు. ఈ సీజన్‌లో అజింక్య రహానె సారథ్యంలోని ముంబై టీమ్ అద్భుత ఆటను కనబరిచింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో ముంబై ఛాంపియన్‌గా అవతరించింది. జట్టు చిరస్మరణీయ విజయానికి గుర్తింపుగా ముంబై క్రికెట్ అసోసియేషన్ జట్టుకు డబుల్ బొనాంజాను ప్రకటించింది. ప్రైజ్‌మనీ కింద వచ్చే నగదుతో పాటు అదనంగా మరో ఐదు కోట్ల రూపాలయను చెల్లించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎంసిఎ అధ్యక్షుడు అమోల్ ఖేర్ వెల్లడించారు. ఈ సీజన్ ముంబైకి ఎంతో కలిసి వచ్చిందని, అన్ని టోర్నీల్లో కలిపి ఏడు టైటిళ్లు జట్టుకు దక్కాయని వివరించారు. విజేత జట్టును ఎంసిఎ కార్యదర్శి అజింక్య నాయక్ కూడా అభినందించారు.

క్రికెట్‌కు ధవళ్ కులకర్ణ గుడ్‌బై
ముంబై: టీమిండియా సీనియర్ క్రికెటర్ ధవళ్ కులకర్ణి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కాలం పాటు దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన ధవళ్ రంజీ ట్రోఫీ ఫైనల్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటానని ధవళ్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ధవళ్ ముంబై తరఫున ఆరు సార్లు రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఈ క్రమంలో ఐదు సార్లు జట్టును విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర పోషించాడు. అండర్14, అండర్19 విభాగాల్లో కూడా ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. కాగా, 2014లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. అయితే ధవళ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అతను 12 వన్డే, రెండు టి20లలో మాత్రమే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపిఎల్‌లో వివిధ జట్ల తరఫున 92 మ్యాచ్‌లు ఆడాడు. కాగా, 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 281 వికెట్లను పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News