ఆంజనేయులు కస్టడీ కోరుతూ సిఐడి పిటిషన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ముంబై నటి కాదంబరి జత్వానీపై కేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి పిఎస్‌ఆర్ ఆంజనేయులను కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన సిని నటి జత్వానీపై తప్పుడు కేసు పెట్టించి, అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు గురిచేసిన కేసులో ఎ2గా ఉన్న పిఎస్‌ఆర్ ఆంజనేయులను సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. ఆయనకు విజయవాడ సిఐడి కోర్టు మే 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
అనంతరం ఆయనను విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో సిఐడి తాజాగా ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు పర్చింది. ఓ పారిశ్రామికవేత్తను అత్యాచార కేసు నుంచి బయటపడేసేందుకు అప్పటి సిఎం జగన్ హయాంలో సిఎంఒ కేంద్రంగా నాటి నిఘా విభాగాధిపతి పిఎస్‌ఆర్ ఆంజనేయులు, వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తదితరులతో కలిసి ఫోర్జరీ దస్త్రం ఆధారంగా తనపై అక్రమ కేసు పెట్టి, వేధించారని జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆంజనేయులను సిఐడి అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.