Thursday, January 23, 2025

ఢిల్లీ, ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నైరుతి పవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి రుతుపవనాలు కాస్త ఆలస్యమైనప్పటికీ క్రమంగా దేశమంతా విస్తరించాయి. రానున్న మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 24గంటల్లో దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గుజరాత్ లో శుక్ర, శని వారాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కోస్తా కర్ణాటక, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక బీహార్, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఢిల్లీ, ముంబైల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. ఢిల్లీలో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రతలు 26.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ సీజన్‌లో ఇది సగటు ఉష్ణోగ్రతల కంటే తక్కువ. ముంబై లోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి వర్షం కురుస్తోంది.

దాదర్, మహిమ్, ఖార్, మాతుంగా, కుర్లా ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. గత 12 గంటల్లో 40 మిల్లీ మీటర్ల నుంచి 70 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కేరళలో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరదల వల్ల ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

పల్లపు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు.కొట్టాయంలో ఇళ్ల లోకి నీరు చేరింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈమేరకు ఇడుక్కి, కాసర్‌గడ్, కన్నూర్ సహా మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News