లాహోర్: ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణపై ముంబయి దాడుల సూత్రధారి, లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ-ఉర్-రహ్మాన్ లఖ్వీని శనివారం పాకిస్తాన్లో అరెస్టు చేశారు. ఐక్య రాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదులలో ఒకడైన లఖ్వీని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన ఉగ్రవాద నిరోధక శాఖ(సిడిటి) అధికారులు అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబయి దాడి కేసులో లఖ్వీ 2015లో జామీనుపై విడుదలయ్యాడు. అయితే, పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులపై విచారణ వేగవంతం చేయాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన పాక్ ప్రభుత్వం లఖ్వీని అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 61 సంవత్సరాల లఖ్వీ ఉగ్రవాదుల కోసం వసూలు చేసిన డబ్బులతో ఒక ఆసుపత్రి నడుపుతున్నాడని సిటిడి అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రి పేరు చెప్పి డబ్బులు వసూలు చేయడమేకాక వాటిని తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలకు లఖ్వీ, అతని సహచరులు ఖర్చు పెట్టారని, ఈ నిధులను అతను వ్యక్తిగత అవసరాల కోసం కూడా ఖర్చు పెట్టుకున్నాడని సిడిటి తన నివేదికలో పేర్కొంది.
Mumbai attack mastermind Lakhvi arrested in Pakistan