ప్రతీకారం కోసం చెన్నై, ఆత్మవిశ్వాసంతో రోహిత్ సేన
రేపు సిఎస్‌కెతో ముంబై ఢీ
దుబాయి: ఐపిఎల్ రెండో దశలో భాగంగా ఆదివారం జరిగే ఆరంభ మ్యాచ్‌కు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగనున్నాయి. ఇక తొలి దశలో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో చెన్నై కనిపిస్తోంది. మరోవైపు రోహిత్ సేన కూడా మరో విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో రెండో అంచెకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్, ఆల్‌రౌండర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి.
ముంబైకి కీలకం..
మరోవైపు ఈ మ్యాచ్ చెన్నైతో పోల్చితే ముంబైకి చాలా కీలకమని చెప్పాలి. తొలి దశ మ్యాచుల్లో ముంబై ఏడు మ్యాచులు ఆడగా నాలుగింటిలో మాత్రమే గెలుపొందింది. చెన్నై మాత్రం ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలను సొంతం చేసుకుని రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ముంబైకు వరుస విజయాలు సాధించడం తప్పనిసరి. కనీసం మరో నాలుగు మ్యాచుల్లో గెలిస్తేనే ముంబైకి ప్లేఆఫ్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఇక చెన్నైకి కూడా ఇది కీలకమైన సమరమేనని చెప్పాలి. మొదటి దశ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా చెన్నైకి ఓటమి తప్పలేదు. డుప్లెసిస్, రాయుడు, మోయిన్ అలీ తదితరులు విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 219 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కానీ కీరన్ పొలార్డ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోవడంతో ముంబై సంచలన విజయం సాధించింది. ఈసారి కూడా ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పక పోవచ్చు.
స్టార్లకు కొదవలేదు..
ఇటు ముంబై అటు సిఎస్‌కె జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సీనియర్లు సురేశ్ రైనా, రాయుడు, డుప్లెసిస్, మోయిన్ అలీ, రవీంద్ర జడేజాలతో చెన్నై చాలా బలంగా ఉంది. అంతేగాక ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఎంగిడి తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అంతేగాక ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే డ్వేన్ బ్రావో ఉండనే ఉన్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇక ముంబైలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైకి చాలా కీలకమని చెప్పాలి. ఈసారి కూడా అతను డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్య వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య వంటి ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లతో ముంబై చాలా బలంగా ఉంది. వీరితో పాటు బలమైన బౌలింగ్ లైనప్ కూడా ఇండియన్స్‌కు ఉందని చెప్పాలి. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్, కృనాల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ముంబైలో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.