డ్రగ్స్ ను తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు
ముంబయి: రూ.14.44 కోట్ల విలువైన మాదకద్రవ్యం ‘చరాస్’ను జప్తు చేసినట్టు ముంబయి పోలీసులు వెల్లడించారు. కాశ్మీర్ నుంచి నలుగురు వ్యక్తులు కారులో తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. అరెస్టయినవారిలో ఇద్దరు మహిళలున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బందుదగడు ఉదన్‌సింహే(52) తన కుటుంబసభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లి వస్తున్నట్టుగా నటిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు గుర్తించామని డిప్యూటీ కమిషనర్(డిటెక్షన్1) దత్తానలవాడే తెలిపారు. సోమవారం ఉదయం ముంబయి పశ్చిమ శివారులోని దాహిసర్ హైవేపై వెళ్తున్న కారును ఆపి చెక్ చేయడంతో డ్రగ్స్ గుట్టు బయటపడిందన్నారు.
కారు డోర్స్‌తోపాటు వెనకభాగంలో డ్రగ్స్‌ను రహస్యంగా పెట్టి తరలిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. చరాస్‌ను జప్తు చేసినపుడు కారులో ఉదన్‌సింహే భార్య క్లేరా, కూతురు సింథియా(23), మరో వ్యక్తి జసార్ జహంగీర్‌షేఖ్(24) ఉన్నారని ఆయన తెలిపారు. వీరు ముంబయిలోని అంధేరీలో నివాసముంటున్నారని తెలిపారు. మరికొందరితో కలిసి ముంబయిలోని వినియోగదారులకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, దర్యాప్తులో వివరాలు వెల్లడవుతాయన్నారు. 2010లోనూ ఉదన్‌సింహే 39 కిలోల చరాస్‌తో ముంబయి పోలీసులకు చిక్కారు. ఆ కేసులో మొత్తం ఆరుగురు అరెస్ట్ కాగా, వారిలో కొందరు అనంత్‌నాగ్‌కు చెందినవారు.