ముంబయి: టెలివిజన్ రేటింగ్ పాయింట్(టిఆర్‌పి) కేసులో నిందితుడైన బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్(బార్క్) మాజీ సిఇఓ పార్థో దాస్‌గుప్తా బెయిల్ దరఖాస్తును ముంబయిలోని సెషన్స్ కోర్టు బుధవారం తిరస్కరించింది. దాస్‌గుప్తాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెల పుణెలో అరెస్టు చేశారు. బూటకపు టిఆర్‌పి కుంభకోణంలో దాస్‌గుప్తా కీలకపాత్ర పోషించారని అభిప్రాయపడిన మెజిస్ట్రేట్ కోర్టు ఇదివరకే ఆయన బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. తాజాగా..సెషన్స్ కోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది.
ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా అనేక కోణాలలో దర్యాప్తు జరగవలసి ఉందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హిరయ్ సెషన్స్ కోర్టులో వాదించారు. కీలక వ్యక్తయిన దాస్‌గుప్తాకు మొత్తం వ్యవస్థపై గట్టి పట్టు ఉన్నదని, ఆయనను ఈ దశలో బెయిల్‌పై విడుదల చేస్తే తన కింద పనిచేసిన ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రభావితం చేసే ఆస్కారం ఉందని హిరయ్ వాదిస్తూ దాస్‌గుప్తా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన దాస్‌గుప్తా, రిపబ్లిక్ టివికి చెందిన ఆర్నాబ్ గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.