తల్లితో ఉండేందుకు కోర్టు అనుమతి నిరాకరణ
ముంబై: తన తల్లితో కలసి నివసించడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ షీనా బోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీల కుమార్తె, ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న విధీ ముఖర్జీ అభ్యర్థనను ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది. షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణి, పీటర్ ముఖర్జీల కుమార్తె విధీ గడచిన అనేక ఏళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. సెప్టెంబర్ 10న ఆమె ముంబై రానున్నట్లు ఆగస్టు 30న దాఖలు చేసిన పిటిషన్ ద్వారా తెలుస్తోంది. కాగా..షీనా బోరా హత్య కేసుప విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌పి నాయక్ నింబాల్కర్ ఆమె దరఖాస్తును తిరస్కరింఆరు. ఇంద్రాణి ముఖర్జీ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై ముంబైలో ఉంటున్నారు.
తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో 2015లో ఇంద్రాణి ముఖర్జీ అరెస్టయ్యారు. అప్పట్లో మైనర్‌గా ఉన్న విధీ లండన్‌కు వెళ్లిపోయారు. తన తల్లి ప్రస్తుతం తీవ్ర మనోవ్యాధితో బాధపడుతున్నారని, ఆమెకు వ్యక్తిగత పరిచర్యలు, వైద్య సంరక్షణ అవసరమని విధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తల్లికి సేవ చేసుకునే అవకాశం తనకు కల్పించాలని విధీ కోరారు. అయితే, విధీ ముఖర్జీ ప్రాసిక్యూషన్ తరఫు సాక్షి అని, ఆమెను ఇంతవరకు విచారించలేదని ప్రాసిక్యూషన్(సిబిఐ) తరఫు న్యాయవాది బుధవారం వాదిస్తూ ఇంద్రాణితో ఆమె కలసి ఉండడానికి అనుమతించకూడదని కోరారు.