Friday, November 22, 2024

ఆర్యన్ అరెస్టుతో దృష్టి మళ్లిస్తున్నారు: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

Cruise raid

ముంబయి: “క్రూయిజ్ నౌకపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) జరిపిన దాడి ఇటీవల గుజరాత్‌లోని ముంద్రాలో పట్టుకున్న మాదకద్రవ్యాల విషయం నుంచి దృష్టి మళ్లించడానికే” అని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. గుజరాత్ రేవులో పట్టుకున్న మాదకద్రవ్యాల విషయంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేసింది.
గుజరాత్ కచ్ జిల్లాలోని అదానీకి చెందిన ముంద్రా రేవులో రెండు కంటెనైర్‌లలో వచ్చిన రూ. 21,000కోట్ల విలువచేసే 2,988.21కిలోల హెరాయిన్‌ను గత నెల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) జప్తు చేసుకుంది. ఇదిలావుండగా ఎన్‌సిబి ఆదివారం బాలివుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను, మరో ఏడుగురిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ముంబయి నుంచి గోవాకు వెళ్లాల్సిన నౌకపై ఎన్‌సిబి అధికారులు దాడులు చేసి ఆర్యన్ ఖాన్‌ను, ఇతరులను అరెస్టు చేశారు.

“షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారని వార్త. కానీ ఎక్కడి నుంచి ఆ మాదకద్రవ్యం వచ్చింది? ఆ క్రూయిజ్ నౌక నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్‌సిబి ఉన్నపళంగా చెబుతోంది” అని కాంగ్రెస్ ప్రతినిధి షమా మొహమ్మద్ విలేకరులతో అన్నారు. వారు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముంద్రా(గుజరాత్) రేవుకు స్మగ్లింగ్ అయిన మాదకద్రవ్యం విషయం నుంచి దృష్టిని మళ్లిస్తున్నారు. అసలు విషయం ముంద్రా రేవు పట్టణందేనని ఆమె అన్నారు.

“ఎన్‌సిబి అక్కడా ఇక్కడ కొంత మందిని పట్టుకుంటుంది. దానినే మీడియా కూడా చూయిస్తుంది. విషయాన్ని దృష్టి మళ్లిస్తారు. ముంద్రా రేవు పట్టణం ఘటనపై ఎందుకు దర్యాప్తు జరగడం లేదో రాయాలని నేనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అసలు అక్కడ ఏమి జరుగుతోంది. ఎందుకు దానిని పట్టించుకోవడంలేదు?” అని ఆమె ప్రశ్నించారు.
“ఇప్పుడు ముంబయిలో ఈ క్రూయిజ్ నౌకలో పట్టుకున్న మాదకద్రవ్యాలు ఆ ముంద్రా రేవుకు సంబంధించినవి కావా? అక్కడి నుంచి ఆ మాదకద్రవ్యం రాకపోతే అసలు ఇక్కడ ఎలాంటి పార్టీ జరిగి ఉండేదే కాదు” అని షమా మొహమ్మద్ అన్నారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ముంద్రా రేవుకు సంబంధించిన మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పైన విచారణ జరిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మౌనంగా ఉండడాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. గుజరాత్ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేంద్రంగా మారుతోందని ఆమె ఆరోపించారు. రేవులను ప్రైవేటీకరించడం వల్ల ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోవగలవన్న భయాందోళనలను కూడా వ్యక్తంచేశారు.
‘అంతర్జాతీయ సరిహద్దులు దాటి మాదకద్రవ్యాలు మనదేశంలోకి వస్తుంటే దేశంలోని నిఘా, నియంత్రణ సంస్థలు ఏమి చర్యలు చేపడుతున్నాయి?” అని కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి అతుల్ లోంధే ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News