దీపావళి రాత్రి అత్యధిక టపాసుల శబ్దంతో దద్దరిల్లిన ముంబై
గత ఏడాది 109.1 డెసిబిల్స్ కాగా ఈ ఏడాది 117 డెసిబిల్స్ శబ్దం నమోదు
ముంబై : దీపావళి పండగ సందర్భంగా గత ఏడాది కన్నా టపాసుల భారీ శబ్దాలతో ముంబై నగరం దద్దరిల్లింది. గత ఏడాది ఈ శబ్దాల ప్రకంపనల స్థాయి 109.1 డెసిబుల్స్‌గా నమోదు కాగా, ఇప్పుడు 117 డెసిబుల్స్ స్థాయి వరకు మించిపోయిందని శబ్ద కాలుష్య అవగాహన ప్రభుత్వేతర సంస్థ అవాజ్ ఫౌండేషన్ వెల్లడించింది. గాలి నాణ్యత ప్రమాణాల దృష్టా దీపావళి రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలోనే బాణాసంచా కాల్చాలని, టపాసులు పేల్చాలని శుక్రవారం బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, చాలా చోట్ల రాత్రి 10 గంటలు దాటినా టపాసులు పేల్చడం జరిగింది.
సౌత్ ముంబైలో మెరైన్‌డ్రైవ్‌లో రాత్రి 9.55 గంటలకు 82 నుంచి 117 స్థాయిలో డెసిబుల్స్ నమోదు కావడం విశేషం. జనం గుంపుగా చేరి వరుసగా టపాస్ బాంబులను పేలుస్తూ గాలిలో విసురుతూ ఆనందించడం కనిపించింది. రాత్రి 9 గంటల తరువాత టపాసులను పేల్చడం ఎక్కువైందని అవాజ్ సంస్థాపకులు సుమైరా అబ్దులాలి పేర్కొన్నారు. శివాజీ పార్కు వద్ద రాత్రి 7.45 గంటల నుంచి టపాసులను పేల్చడం ప్రారంభించారని, శివాజీ పార్కు నుంచి మెరైన్‌డ్రైవ్ వరకు కొన్ని టపాసులను పేల్చడమైందని తెలిపారు.
నివాస ప్రాంతమైన శివాజీ పార్కు వద్ద రాత్రి 7.45 గంటలకు శబ్ద స్థాయి 99 డెసిబిల్స్‌కు చేరుకోగా, 11.45 కు 95 డెసిబిల్స్‌కు చేరిందని పేర్కొన్నారు. శివాజీ పార్కు వద్ద 2021లో దీపావళి రోజున శబ్దస్థాయి 100.4 డెసిబిల్స్ వరకు రికార్డయిందని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టపాసుల్లో ఎలాంటి విష రసాయన పదార్ధాలను అనుమతించనప్పటికీ, రసాయన పరీక్షలో కోర్టు నిషేధించిన బేరియం కనిపించిందని, చెప్పారు. దీనివల్ల గాలిలో నాణ్యత క్షీణిస్తుందన్నారు.