ముంబయి: ఓ ప్రమాదంలో కాళ్లూ,చేతులూ కోల్పోయిన 22 ఏళ్ల యువకుడికి ముంబయిలోని గ్లోబల్ హాస్పిటల్స్ వైద్యులు రెండు చేతులూ విజయవంతంగా అతికించారు. ట్రాన్స్‌ప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా ఈ ఘనత సాధించారు. బాధితుడి ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని సర్జరీ నిర్వాహకుల్లో సీనియర్ వైద్యుడైన డాక్టర్ నీలేశ్ సత్భాయ్ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ఏడాదిన్నర క్రితం హైటెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో కాళ్లూ, చేతులూ కోల్పోయాడు. ఒక చేయి భుజం కింది భాగం వరకూ తెగిపోగా, మరో చేయి భుజం పైభాగం వరకూ తెగిపోవడంతో తమకు సవాల్‌గా మారిందని సత్భాయ్ తెలిపారు. దాత నుంచి తీసుకున్న రెండు చేతుల్నీ అతికించడానికి 13 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఇటువంటి సర్జరీ తమ హాస్పిటల్లో ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. సర్జరీ అనంతర ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కోలుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. ఏడాదిపాటు ఫిజియోథెరపీ కూడా అవసరమన్నారు. 2020లోనూ మోనికా మోరే అనే యువతికి రెండు చేతుల్నీ తాము అతికించామని ఆయన తెలిపారు. 2014లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఆమె తన చేతుల్ని కోల్పోయారు.
ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స ద్వారా రెండు చేతులూ అతికించిన ముంబయి వైద్యులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -