Wednesday, January 22, 2025

కిడ్నాపైన తొమ్మిదేళ్ల తర్వాత తల్లితో బాలిక సమాగమం

- Advertisement -
- Advertisement -

Mumbai Girl missing from 9 years found

పనిమనిషి సాయంతో మిస్సింగ్ కేసు సుఖాంతం

ముంబై: ముంబై నగరంలో తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురైన ఒక చిన్నారి ఒక పనిమనిషి సాయంతో ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను కలుసుకుంది. 2013 జనవరి 22వ తేదీ ఉదయం ముంబైలోని డిఎన్ నగర్ ప్రాంతంలో 4వ తరగతి చదువుతున్న తన అన్నతో కలసి పూజా గౌడ్ మున్సిపల్ స్కూలుకు వెళుతుండగా కిడ్నాప్‌నకు గురైంది. ముందు నడుస్తున్న అన్నకు చెల్లి అపహరణకు గురైందన్న విషయం స్కూలుకెళ్లిన తర్వాత కాని తెలియరాలేదు. వెంటనే ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియచేయగా వారు డిఎన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్పింగ్ పర్సన్ కేసు నమోదు చేసిన పోలీసులు నగరమంతా స్కూలు యూనిఫారమ్‌లో ఉన్న పూజ ఫోటోతో గల పోస్టర్లు అంటించారు. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్(ఇప్పుడు రిటైర్డ్) రాజేంద్ర భోస్లేకు ఆ బాలిక ఆచూకీ కనిపెట్టడం సవాలుగా మారింది. సంవత్సరాలు గడిచిపోయాయి..భోస్లే రిటైర్ అయిపోయారు కాని పూజా గౌడ్ ఆచూకీ మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. అయితే&ముంబైలోని జుహు ప్రాంతంలో ఇళ్లలో పనిచేసే ప్రమీలా దేవేంద్ర అనే 35 ఏళ్ల మహిళకు తనలాగే ఇళ్లలో పనిచేసే ఒక బాలిక పరిచయమైంది.

తన పేరు పూజ అని..తన కుటుంబ సభ్యులు తనను హింసిస్తున్నారంటూ ఆ బాలిక ప్రమీల వద్ద వాపోయింది. వాళ్లు తన సొంత తల్లిదండ్రులు కాదని, తనను వాళ్లు అపహరించారని పూజ చెప్పడంతో అప్రమత్తమైన ప్రమీల ఇంటర్‌నెట్‌లో మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆమెకు పూజ అపహరణకు సంబంధించిన పత్రికా వార్తలు నెట్‌లో లభించాయి. వెంటనే ఆమె ఈ కేసు గురించి డిఎన్ నగర్ పోలీసులకు సమాచారం అందచేసింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పూజ గురించి ఆరా తీసి తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యమైన బాలిక ఈమేనని నిర్ధారించుకున్నారు. అనంతరం పూజను కిడ్నాప్ చేసి తమ వద్దే ఉంచుకున్న హ్యారీ డిసౌజ, అతని భార్యను ప్రశ్నించారు. పిల్లలు లేకపోవడంతో పూజను కిడ్నాప్ చేశానని హ్యారీ డిసౌజ అంగీకరించినట్లు డిఎన్ నగర్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మిలింద్ ఖుర్దే శనివారం విలేకరులకు తెలిపారు. కొన్నేళ్లపాటు పూజను బెంగళూరులో ఉంచి తిరిగి ముంబైకి తెచ్చినట్లు డిసౌజ ఒప్పుకోవడంతో అతడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. డిసౌజ నివసిస్తున్న ఇంటికి కేవలం కిలోమీటరు దూరంలోనే నివసిస్తున పూజ తల్లి పూనమ్, అన్న రోహిత్(19)తో శుక్రవారం పూజను పోలీసులు కలిపారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆ కుటుంబాన్ని మళ్లీ ఏకం చేయడం తమను సైతం ఎంతో ఉద్వేగానికి గురి చేసిందని ఇన్‌స్పెక్టర్ ఖుర్దే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News