Sunday, December 22, 2024

భీకర గాలులతో తల్లడిల్లిన ముంబై

- Advertisement -
- Advertisement -

మహానగరం ముంబైలో సోమవారం వాతావరణం అతలాకుతలం అయింది. ఉధృతస్థాయి దుమ్మూధూళి తుపాన్, వర్షాకాలానికి ముందే తొలి వర్షంతో నగరవాసులు తల్లడిల్లారు. ఇటీవలికాలంలో ఎప్పుడూ లేనంతగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దుమ్ముతుపాన్ చెలరేగడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు రోడ్లపైనే నిలిపి వాహనదారులు చాలా సేపటివరకూ షెల్టర్లలో నిలిచిపొయ్యారు. వాతావరణ ప్రతికూలతతో విమానాశ్రయాలలో రాకపోకలు నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకాశం కాటుకు ధట్టించినట్లుగా నల్లగా మారింది. ఇంతకాలం ఉక్కపోతలతో సతమతమయిన నగరవాసులు అకాల భారీ వర్షంతో కొద్దిగా ఉపశమనం పొందారు. అయితే కళ్లుమూసుకుపొయ్యే రీతిలో దుమ్మూతుపాన్ చెలరేగడంతో జనం ఇదేం చోద్యం అనుకున్నారు. ఉన్నట్లుండి వాతావరణం మారింది.

రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపొయ్యాయి. ఘట్కోపార్, బాంద్రా కుర్లా, ధరవి ప్రాంతాలలో బలమైన గాలులు వీచాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని గమనించి బొంబాయి ఎయిర్‌పోర్ట్‌లో విమానాలను నిలిపివేశారు. దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టులలో ఒక్కటైన ఇక్కడి ఎయిర్‌పోర్టు చాలా సేపటివరకూ అస్థవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై ఒక్కటే కాకుండా థానే, ఫాల్ఘాట్, రాయ్‌గఢ్, నాగర్, తూర్పు శివారు ప్రాంతాల్లో రెండుగంటల పాటు ఈదురుగాలులు వీచాయి. పుణే, సతారా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. పెనుగాలలకు పై కప్పులు కూలిన ఘటనలలో కొన్ని ప్రాంతాలలో ఏడుగురు గాయపడ్డారు. వీరిని రాజావాడి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

ఓ పెట్రోలు బంకు వద్ద ఉన్న 100 మీటర్ల ఎతైన బోర్డు కిందపడింది. దీనితో ఇక్కడున్న వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ధడేలు మంటూ భారీ కటౌటు నేలకు ఒరిగిపడటంతో అక్కడున్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. పెనుగాలులతో నవీ ముంబైలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గంటల పాటు ముంబైని ఈదురుగాలులు వీడకుండా చుట్టేయడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. నగరంలో మరిరెండు రోజులు ఈ అసాధారణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ సాయంత్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News