Tuesday, November 5, 2024

ముంబైలో కుప్పకూలిన ఇనుప హోర్డింగ్.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మహానగరం ముంబైలో సోమవారం వాతావరణం అతలాకుతలం అయింది.స్థానిక ఘట్కోపార్‌లో ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వెంబడి ఉన్న పెట్రోలు బంకు వద్ద గాలుల తీవ్రతకు ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, 50 మంది గాయపడ్డారు. హోర్డింగ్ విడిభాగాల కింద వంద మందికిపైగా చిక్కుపడ్డారు. భాగాలను తొలిగించి వీరిని కాపాడేందుకు వెంటనే సహాయక బృందాలు అక్కడికి తరలివెళ్లాయని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇక్కడి హోర్డింగ్ వంద అడుగుల ఎత్తుతో ఉన్న ఇనుప హోర్డింగ్ కావడంతో, ఇది విరిగికిందపడటంతో పెను ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న పెట్రోలుబంక్, కొన్ని ఇళ్లపై ఈ హోర్డింగ్ పడింది.సమీపంలోనే పెట్రోలు బంక్, గ్యాస్ స్టేషన్ ఉండటంతో వెంటనే గ్యాస్ కట్టర్లను వాడలేకపొయ్యారు. ఇనుపశకలాలలను తొలిగించేందుకు కార్మికులను రంగంలోకి దింపారు. జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పెనుసుడిగాలులు ముంబైవాలాలకు నరకం చూపాయి.

ఉధృతస్థాయి దుమ్మూధూళి తుపాన్, వర్షాకాలానికి ముందే తొలి వర్షంతో నగరవాసులు తల్లడిల్లారు. ఇటీవలికాలంలో ఎప్పుడూ లేనంతగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దుమ్ముతుపాన్ చెలరేగడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు రోడ్లపైనే నిలిపి వాహనదారులు చాలా సేపటివరకూ షెల్టర్లలో నిలిచిపొయ్యారు. వాతావరణ ప్రతికూలతతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకాశం కాటుక ధట్టించినట్లుగా నల్లగా మారింది. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. ఇంతకాలం ఉక్కపోతలతో సతమతమయిన నగరవాసులు అకాల భారీ వర్షంతో కొద్దిగా ఉపశమనం పొందారు. అయితే కళ్లుమూసుకుపొయ్యే రీతిలో దుమ్మూతుపాన్ చెలరేగడంతో జనం ఇదేం చోద్యం అనుకున్నారు. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపొయ్యాయి. ఘట్కోపార్, బాంద్రా కుర్లా, ధరవి ప్రాంతాలలో బలమైన గాలులు వీచాయి. ముంబై ఒక్కటే కాకుండా థానే, ఫాల్ఘాట్, రాయ్‌గఢ్, నాగర్, తూర్పు శివారు ప్రాంతాల్లో రెండుగంటల పాటు ఈదురుగాలులు వీచాయి.

పుణే, సతారా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. .పెనుగాలులతో నవీ ముంబైలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గంటల పాటు ముంబైని ఈదురుగాలులు వీడకుండా చుట్టేయడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. నగరంలో మరిరెండు రోజులు ఈ అసాధారణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ సాయంత్రం తెలిపింది.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్పందన
భారీ స్థాయిలో సహాయక చర్యలకు ఆదేశాలు
హోర్డింగ్ విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని స్పందించారు. పెద్ద ఎత్తున సహాయక పనులు జరుగుతున్నాయని ముంబై పోలీసు బృందాలు, మున్సిపల్ సిబ్బంది, అగ్నిమాపక దళాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్ , మహానగర్ గ్యాస్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సంస్థ ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలలో పాల్గొన్నాయి. హోం మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న ఫడ్నవిస్ తాము పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. గాలివానతో రైళ్ల ప్రయాణాలకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News