Friday, November 22, 2024

జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా-ముంబై మెయిల్..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖారవాన్ జిల్లాలో మంగళవారం తెలవారుజామున హౌరా-ముంబై మెయిల్‌కు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించగా మరో 20 మంది గాయపడ్డారు. ఆగ్నేయ రైల్వేలోని చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే బారాబంబూ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జంషెడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమీపంలోనే మరో గూడ్సు రైలు కూడా పట్టాలు తప్పిందని, అయితే ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగిందీ లేనిదీ తెలియరాలేదని ఆగ్నేయ రైల్వే అధికార ప్రతినిధి ఓం ప్రకాష్ చరణ్ విలేకరులకు తెలిపారు. హౌరా-ముంబై మెయిల్ ప్రమాదంపై దర్యాప్తునకు రైల్వే ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

బారాబంబూ సమీపంలో హౌరా-ముంబై మెయిల్‌కు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారని పశ్చిమ సింగ్‌భం డిప్యుటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి ప్రమాద స్థలి వద్ద విలేకరులకు తెలిపారు. హౌరా-ముంబై మెయిల్ ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొందని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులకు బారాబంబూలో ప్రాథమిక చికిత్స అందచేసి మెరుగైన చికిత్స కోసం చక్రధర్‌పూర్‌కు తరలించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. త్రీవంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించినట్లు చక్రధర్‌పూర్ సీనియర్ డిసిఎం తెలిపారు. సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News