వరుస విజయాలతో పెను ప్రకంపనలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉన్న సంతి తెలిసిందే. ముంబై ఇప్పటికే ఐదు ఐపిఎల్ టైటిల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ముంబై అసాధారణ ఆటతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముంబై మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం మూడింటిలో గెలిచినా చాలు ముంబై ప్లేఆఫ్‌కు చేరడం ఖాయం.
సీజన్ ఆరంభ మ్యాచ్‌లలో ముంబై పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కోల్‌కతా జరిగిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించి కాస్త కోలుకున్నట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత లక్నో, బెంగళూరులతో జరిగిన మ్యాచ్‌లలో మళ్లీ పరాజయం చవిచూసింది. దీంతో ఇక మాజీ ఛాంపియన్ కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు సయితం ఓ అంచనాకు వచ్చేశారు. కానీ తర్వాతి మ్యాచుల్లో ముంబై అనూహ్యంగా పుంజుకుంది. అసాధారణ ఆటతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ సీజన్‌లో వరుస విజయాలతో అజేయంగా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీని ఓడించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది.
ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడలేదు. సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సొంతం చేసుకుంది. ఆ వెంటనే మరో బలమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. ఇక ఉప్పల్ వేదికగా జరిగిన కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మరోసారి ఓడించింది. ఇలా వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. గతంలో కూడా ముంబై ఇలాంటి ఆటతోనే టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో కూడా మరోసారి అలాంటి ప్రదర్శనే చేస్తోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలే జారీ చేసింది. మిగిలిన మ్యాచుల్లో కూడా ముంబై ఇదే జోరును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ముంబైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రోహిత్ చివరి రెండు మ్యాచుల్లో జట్టును ముందుండి గెలిపించాడు. చెన్నై, హైదరాబాద్‌పై రోహిత్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. సూర్యకుమార్ కూడా జోరుమీదున్నాడు. రియాన్ రికెల్టన్, విల్ జాక్స్, తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యలతో ముంబై చాలా బలంగా మారింది. బౌలింగ్‌లో దీపక్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, సాంట్నర్, హార్దిక్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు.
సమష్టిగా ముందుకు..
సమష్టిగా పోరాడుతూ ముంబై వరుస విజయాలు సొంతం చేసుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ కూడా సహచరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సఫలమయ్యాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సీనియర్లు రోహిత్, సూర్యకుమార్, దీపక్ చాహర్, సాంట్నర్, బుమ్రా, బౌల్ట్ తదితరులు కూడా హార్దిక్‌కు అండగా నిలుస్తున్నారు. ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తుండడంతో ముంబై ఎదురులేని శక్తిగా మారింది. మిగిలిన మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తూ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడమే లక్షంగా పెట్టుకుంది. ప్రస్తుతం జట్టు ఆటను గమనిస్తే ముంబైని కట్టడి చేయడం ప్రత్యర్థి జట్లకు శక్తికి మించిన పనిగానే చెప్పొచ్చు.