Wednesday, January 22, 2025

సన్‌రైజర్స్ చిత్తు

- Advertisement -
- Advertisement -

సెంచరీతో కదంతొక్కిన గ్రీన్
ముంబై అలవోకగా విజయం
మయాంక్, వివ్రాంత్ శ్రమ వృథా

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సెంచరీతో అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్ గెలిపించడంతో పాటు తొలి ఐపిఎల్ సెంచరీని కూడా తన అకౌంట్‌లో వేసుకున్నాడు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై… కామెరూన్ గ్రీన్(47 బంతుల్లో 100; 8×4,8×6) మెరుపు సెంచరీ తోడవ్వడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది. ఇషాన్ ఔటయిన తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన కామెరూన్ గ్రీన్ విశ్వరూపం చూపాడు. బ్యాట్‌ను ఝళిపించి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 56; 8×4, 1×6) హాఫ్ సెంచరీతో చాలా రోజుల తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. సెంచరీతో కదం తొక్కిన గ్రీన్‌కు ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా, సన్‌రైజర్స్‌పై విజయంతో ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్ అశలు సజీవంగా ఉన్నాయి.

ఓపెనర్లు అదరగొట్టినా..
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 83, 8×4, 4×6), తొలి ఐపిఎల్ మ్యాచ్ ఆడుతున్న వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69, 9×4, 2×6) బ్యాట్ ఝలిపించడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయ గలిగింది. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆకాశ్ మధ్వాల్ విడదీసాడు.

వివ్రాంత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్‌కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హెన్రీచ్ క్లాసెన్‌ను అప్‌ది ఆర్డర్‌లో పంపించగా.. మయాంక్ అగర్వాల్ చెలరేగాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతన్ని మధ్వాల్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే గ్లేన్ ఫిలిప్స్‌ను క్రిస్ జోర్డాన్ ఔట్ చేయగా.. క్రీజులోకి ఎయిడెన్ మార్క్మ్ వచ్చాడు. అయితే మధ్వాల్ 19వ ఓవర్‌లో.. హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 2 ఫోర్లతో 18)ను క్లీన్ బౌల్ చేసి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేసాడు. ఆ మరుసటి బంతికే హ్యారీ బ్రూక్(0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రిస్ జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో సన్వీర్ సింగ్ బౌండరీ కొట్టగా.. మార్క్మ్ ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టు స్కోర్‌ను 200కు చేర్చాడు.

ముంబై అలవోకగా..
భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(14)ను భువనేశ్వర్ కుమార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి రోహిత్ శర్మ జట్టును ముందుకు నడిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఈ జోడీ విరుచుకుపడటంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. మార్క్మ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ జోడీ తిప్పికొట్టింది.

ఈ క్రమంలో కామెరూన్ గ్రీన్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 31 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మయాంక్ దగర్ విడదీసాడు. రోహిత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి రెండో వికెట్‌కు నమోదైన 128 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి సూర్య రాగా.. గ్రీన్ తన జోరును కొనసాగించాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ సునాయస విజయాన్నందుకుంది. విన్నింగ్ రన్‌తో కామెరూన్ గ్రీన్ 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ.

గ్రీన్‌కు తొలి సెంచరీ..
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున కామెరాన్ గ్రీన్ కిది రెండో సెంచరీ కాగా తొలి సెంచరీ సూర్యకుమార్ యాదవ్ చేశాడు. ఇక ఐపిఎల్ 2023లో గ్రీన్‌ది తొమ్మిదో సెంచరీ.. ఇంతకముం దు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు ), విరాట్ కోహ్లీ 100 పరుగులు, శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రభసిమ్రాన్ సింగ్ (103 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (103 పరుగులు నాటౌట్) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు), వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100 పరుగులు నాటౌట్)తో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News