Monday, January 20, 2025

ముంబైని ముంచిన అంతర్గత కుమ్ములాటలు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ సీజన్17లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావించిన ముంబై ఇండియన్స్ ఈసారి అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తదితర జట్లు అద్భుత ఆటతో నాకౌట్ రేసులో నిలిచాయి.

స్టార్ ఆటగాళ్లతో కూడిన ముంబై మాత్రం ఘోరంగా విఫలమైంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య సారథ్యంలో పెను సంచలనం సృష్టిస్తుందని భావించిన ముంబై చెత్త ఆటతో తేలిపోయింది. హార్దిక్ పేలవమైన కెప్టెన్సీ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తొలి మ్యాచ్ నుంచే ముంబై టీమ్ రెండు గ్రూపులుగా విడిపోయింది. హార్దిక్, రోహిత్ గ్రూపులుగా ఆటగాళ్లు విడిపోయారు. కొంత మంది హార్దిక్ కెప్టెన్సీని బహిరంగంగానే వ్యతిరేకించారు. మరికొందరూ హార్దిక్‌కు అండగా నిలిచారు. అయితే ఆటగాళ్ల మధ్య నెలకొన్న విభేదాలు జట్టును సంక్షోభంలోకి నెట్టి వేసింది.

ఇషాన్ కిషన్, రోహిత శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, మహ్మద్ నబి, బుమ్రా, హార్దిక్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. జట్టును ముందుండి నడిపించడంలో హార్దిక్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్దిక్ జట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాడు. గతంలో అద్భుత కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్‌ను విజయపథంలో నడిపించిన హార్దిక్ ముంబై సారథిగా మాత్రం తేలిపోయాడు. కెప్టెన్‌గా ఘోర వైఫల్యం చవిచూశాడు. ఆటగాళ్లను ఏకతాటిపై తెచ్చి జట్టును ముందుకు నడిపించలేక పోయాడు.

ఆటగాళ్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు ముంబై ఆటపై బాగానే ప్రభావం చూపింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమైంది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. హార్దిక్ సారథ్యంలో ముంబై నాకౌట్‌కు అర్హత సాధించడం ఖాయమని విశ్లేషకులు అంచన వేశారు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. 13 మ్యాచుల్లో ఏకంగా 9 పరాజయాలను మూటగట్టుకుంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. సమష్టిగా రాణించడంలో ముంబై విఫలమైంది. దీంతో జట్టుకు వరుస ఓటములు తప్పలేదు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ప్రస్తుత సారథి హార్దిక్‌కు ఎలాంటి సహకారం లభించలేదు. దీంతో ముంబైకి ఈ దుస్థితి ఎదురైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News