ముంబై: ఐపిఎల్‌లోనే అత్యంత జనాదారణ కలిగిన జట్లుగా పేరున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) జట్లకు ఈ సీజన్ ఏమాత్రం కలిసి రావడం లేదు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓటమి పాలైంది. ఇక మాజీ విజేత ముంబై మాత్రం ఆడిన ఆరు మ్యాచుల్లోనూ పరాజయం చవిచూసింది. ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. దీంతో గురువారం చెన్నైతో జరిగే మ్యాచ్ రోహిత్ సేనకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
సిఎస్‌కె కూడా ఇదే లక్షంతో పోరుకు సిద్ధమైంది. టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రెండు జట్లు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. ఇప్పటికే ఇరు జట్లు ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టం మార్చుకున్నాయి. అయితే రానున్న మ్యాచుల్లో భారీ తేడాతో విజయాలు సాధిస్తే అవకాశాలు మెరుగు పడే ఛాన్స్ ఉంది. దీంతో ఇకపై జరిగే అన్ని మ్యాచుల్లో గెలవాలనే పట్టుదలతో ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ముంబైతో పోల్చితే చెన్నై ఈ సీజన్‌లో బాగానే ఆడుతున్నా ఓటములు తప్పడం లేదు. ఇప్పటికే రెండు మ్యాచుల్లో సిఎస్‌కు 200కి పైగా పరుగులు సాధించింది. ముంబై మాత్రం ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతోంది. జట్టును ముందుండి నడిపించడంలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవుతున్నాడు. కనీసం ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా రోహిత్ మెరుగైన ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్న ఇషాన్ కిషన్ కూడా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. అంచనాలకు తగినట్టుగా రాణించలేక పోతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను మెరుగైన బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కూడా ప్రతి మ్యాచ్‌లో నిరాశే మిగుల్చుతున్నాడు. బ్యాట్‌తో బంతితో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌వర్మలు మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది ఒక్కటే ముంబైకి ఊరటనిచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. కాగా, సమష్టిగా రాణిస్తేనే ముంబైకి తొలి విజయం దక్కే ఛాన్స్ ఉంది. చెన్నై కూడా సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. దీంతో ఆ జట్టుకు కూడా వరుస ఓటములు తప్పడం లేదు. ఈసారైనా ఆట తీరును మార్చుకోక తప్పదు. లేకుంటే మరో ఓటమి ఖాయమని చెప్పాలి.