న్యూఢిల్లీ : కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి జోరుమీదున్న ముంబై ఇండియన్స్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ ఫామ్‌లోకి రావడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈసారి కూడా డికాక్ మెరుపులు మెరిపిస్తాడనే నమ్మకంతో ముంబై ఉంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. అతను కూడా గాడిలో పడితే ముంబైకి ఎదురే ఉండదు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అతని వైఫల్యం కూడా జట్టుకు ఇబ్బందిగా మారింది.
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరబచలేక పోతున్నాడు. ఇక ఇషాన్ కిషన్‌ది కూడా ఇదే పరిస్థితి. అతను కూడా బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. ఈసారైన వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కిందటి మ్యాచ్‌లో కృనాల్ పాండ్య దూకుడుగా ఆడడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇక పొలార్డ్ దూకుడు మీద ఉండడం కూడా ముంబైకి ఊరటనిచ్చే అంశమే. హార్దిక్ పాండ్య కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే రోహిత్ సేనకు ఎదురే ఉండదు. రాహుల్ చాహర్, బుమ్రా, బౌల్ట్ తదితరులతో ముంబై బౌలింగ్ చాలా బలంగా ఉంది.
వరుస విజయాలతో..
మరోవైపు చెన్నై వరుస విజయాలతో జోరుమీదుంది. ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై చాలా బలంగా ఉంది. దీపక్ చాహర్, శార్దూల్, ఇమ్రాన్, జడేజా తదితరులు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోతున్నారు. ఓపెనర్లు డుప్లెసిస్, గైక్వాడ్ దూకుడు మీద ఉండడంతో చెన్నై బ్యాటింగ్‌కు తిరుగే లేకుండా పోయింది. ఇక సురేశ్ రైనా, రాయుడు, మొయి న్ అలీ, జడేజాలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్ కూడా పటిష్టంగా ఉండడంతో చెన్నై ఆరో విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.