Sunday, January 19, 2025

రాత మారని ముంబై ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

వరుస ఓటములతో సతమతం
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐపిఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కొన్ని సీజన్‌ల నుంచి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఈ సీజన్‌లో అయితే ముంబై ప్రదర్శన మరింత తీసికట్టుగా తయారైంది. ఈసారి టైటిల్ రేసులో ఉంటుందని భావించిన జట్టు కనీసం ప్లేఆఫ్ రేసులో కూడా నిలువకుండా పోయింది. రోహిత్ శర్మను కాదని గుజరాత్ టీమ్ నుంచి హార్దిక్ తీసుకుని మరి సారథ్య బాధ్యతలు అప్పగించారు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై టైటిల్ సాధించడం ఖాయమని ఇటు ఫ్రాంచైజీ యాజమాన్యం అటు అభిమానులు భావించారు. అయితే ముంబై మాత్రం అత్యంత పేలవమైన ఆటతో ఆశలను వమ్ము చేసింది.

ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. దీన్ని బట్టి ముంబై ఆట ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. చివరగా ఆడిన ఆరు మ్యాచుల్లో ముంబై ఓటములను చవిచూసింది. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో 170 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలతో ముంబైకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది.

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్, కొయెట్జి వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఓపెనర్లు రోహిత్, ఇషాన్‌ల వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. కొన్ని మ్యాచ్‌ల నుంచి రోహిత్, ఇషాన్‌లు వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు శుభారంభం అందించలేక పోతున్నారు. దీంతో ముంబైకి బ్యాటింగ్ కష్టాలు తప్పడం లేదు. ఇక సూర్యకుమార్ బ్యాటింగ్‌లోనూ నిలకడ లోపించింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో దాంటో విఫలమవుతున్నాడు. ఇది కూడా జట్టుకు ఇబ్బందికరంగా మారింది. తిలక్ వర్మ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు.

తేలిపోయిన హార్దిక్..

మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇటు కెప్టెన్‌గా అటు ఆటగాడిగా ఘోర వైఫల్యం చవిచూస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు. సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రాహుల్, రుతురాజ్ తదితరులు అద్భుత కెప్టెన్సీతో తమతమ జట్లను విజయపథంలో నడిపిస్తుండగా హార్దిక్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. అతని పేలవమైన కెప్టెన్సీ వల్లే ముంబైకి ఇలాంటి పరిస్థితి ఎదురైందని అభిమానులు విమర్శిస్తున్నారు. హార్దిక్‌కు సారథ్యం అప్పగించి జట్టు యాజమాన్యం పెద్ద పొరపాటు చేసిందని వారు వాపోతున్నారు. కాగా, హార్దిక్‌పై అభిమానులు, యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదిలావుంటే వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో టైటిల్ రేసు నుంచి నిష్క్రమించడంతో అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News