లక్నో: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ ట్రోఫీ సమరంలో ముంబై టీమ్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. రెస్ట్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ సా 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 76 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సమయానికి సర్ఫరాజ్ ఖాన్ (9), తనుష్ కొటియన్ 20 (నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఇప్పటి వరకు ముంబై 274 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు రెస్ట్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (191) అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 93 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో రెస్ట్ ఇన్నింగ్స్ 416 పరుగుల వద్దే ముగిసింది. ముంబై బౌలర్లలో శమ్స్ ములాని, తనుష్ కొటియన్ మూడేసి వికెట్లను పడగొట్టారు. మోహిత్ అవస్థికి రెండు వికెట్లు దక్కాయి.