Monday, December 23, 2024

సహజీవులు కాదట.. విచిత్ర దంపతులు..

- Advertisement -
- Advertisement -

ఆమె ఆత్మహత్య చేసుకుంది, భయంతో ముక్కలు చేశానన్న నిందితుడు
ముంబై ఫ్లాట్ దారుణంలో కొత్త కోణం
గుడిలో పెళ్లి …గుట్టుగా జీవితం
ఎయిడ్స్‌తో బాధపడుతున్న సానే?

ముంబై : స్థానిక మీరారోడ్ అపార్ట్‌మెంట్‌లో మహిళ సరస్వతి వైద్య దారుణ హత్య, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 36 ఏండ్ల సరస్వతితో 56 ఏండ్ల మనోజ్ సానే ఇక్కడి ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నట్లు ఈ క్రమంలో దారుణంగా ఆమెను చంపివేసినట్లు వెల్లడైంది. అయితే తమ ఇరువురికి పెళ్లి అయిందని, దీనిని తాము దాచిపెట్టి ఉంచామని సానే చెపుతున్నట్లు ముంబై పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆమెనే విషం తాగి ఆత్మహత్య చేసుకుందని, దీనితో తనకు భయం వేసి, మృతదేహాన్ని ఈ విధంగా వదిలించుకోవాలని చూశానని చెపుతున్నట్లు వెల్లడైంది.

సానేను గురువారం పోలీసులు అరెస్టు చేసి విచారించారు. తనకు హెచ్‌ఐవి పాజిటివ్ ఉందని, తాము ఇద్దరం పెళ్లి చేసుకుని రహస్యంగా ఉంటున్నప్పటికీ తమ మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదని సానే ఇంటరాగేషన్‌లో తెలిపారు. వీరు గుడిలో పెళ్లి చేసుకున్నట్లు , అయితే ఈ పెళ్లి నమోదు చేసుకోలేదని ఈ ప్రాంతపు డిసిపి జయంత్ బజ్‌బలే తెలిపారు. తనకు ఆయనతో పెళ్లి అయిన విషయాన్ని వైద్య తన ముగ్గురు సోదరిలకు తెలిపింది. అయితే సానేకు తనకు వయస్సు తేడా ఎక్కువగా ఉండటంతో పెళ్లి గురించి ఎవరికి తెలియచేయకుండా ఈ ఫ్లాట్‌లో ఉంటున్నట్లు సానే విచారణ క్రమంలో తెలిసిందని డిసిపి చెప్పారు.

ఈ నెల 3న ఆమె ఆత్మహత్య చేసుకుందని , విషం తీసుకోవడంతో నురగలు రావడంతో తాను భయపడ్డానని తరువాత చనిపోయిందని, తనే చంపినట్లు అవుతుందని భావించి శరీరభాగాలను పారవేసేందుకు యత్నించానని సానే చెప్పినట్లు డిసిపి తెలిపారు. తానుకూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, ఈ లోగా పట్టుబడ్డానని చెప్పాడు. అయితే ఈ వ్యక్తి వాదనపై పోలీసులు పూర్తి స్థాయిలో ఓ నిర్థారణకు రాలేదు. దర్యాప్తు క్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇదో కల్పిత కథ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. సానేకు ఈ నెల 16 వరకూ పోలీసు కస్టడీ విధించారు. ఈ ఫ్లాట్‌లో జరిగిన దారుణం తీవ్రసంచలనానికి దారితీసింది. ఆమె శరీరభాగాలను కొన్నింటిని పారవేయడం, కొన్నింటిని మరిగించడం, బయట వీధికుక్కలకు వేయడం వంటివి చేశాడని ప్రాధమికంగా తెలిసింది.

ఇద్దరూ భార్యా భర్తలే
పోలీసులకు తెలిపిన వైద్య తోబుట్టువులు, తమ సోదరికి సానేతో పెళ్లయిందని, వీరిరువురు దంపతులు అని వైద్య ముగ్గురు సోదరిలు శుక్రవారం పోలీసులకు తెలిపారు. తమది చాలా పేద కుటుంబం అని, తల్లి చనిపోయిందని, తండ్రి తమను వదిలేసి వెళ్లాడని, దీనితో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, పదవతరగతి వరకూ చదివిన తమ అక్క వైద్యకు సానే ఓ చిన్న ప్రైవేటు ఉద్యోగం ఇప్పించాడని వీరు పోలీసులకు తెలిపారు. ఫ్లాట్‌లో ఇప్పుడు ఏమి జరిగింది? ఇంత దారుణ స్థితిలో తమ అక్క బలికావడానికి కారణాలు ఏమిటనేది తమకు అంతుపట్టడం లేదని వీరు వాపోతున్నారు. వైద్య కొన్ని సందర్భాలలో పొరుగువారితో ఆయన తన అంకుల్ అని చెపుతూ ఉండేదని, తరువాత వీరిరువురు సహజీవనపు తంతు అని ఫ్లాట్‌ల్లోని వారు అనుమానించారని పోలీసు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News